సంబరం శుభారంభం

15 Oct, 2019 10:14 IST|Sakshi

అమ్మ పండగ ఆరంభమైంది. తొలేళ్లతో ఉత్సవానికి శంఖారావం పూరించినట్టయింది. సోమవారం వేకువఝాము నుంచే వివిధ వేషధారణలు... డప్పులు... ఘటాలు... మొక్కుబడులతో వచ్చిన భక్తజనంతో అమ్మవారి ఆలయం పోటెత్తింది. పూసపాటి వంశీయుల నుంచి సంప్రదాయ బద్ధంగా పట్టువస్త్రాలు వచ్చాయి. ప్రతి ఒక్కరికీ దర్శనం నిరాటంకంగా సాగేలా... ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా... చేపట్టిన ముందస్తు ఏర్పాట్లు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఇక మంగళవారం జరిగే సిరిమానోత్సవానికి యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 

సాక్షి, విజయనగరం టౌన్‌: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తొలేళ్ల ఉత్సవం సోమవారం అంగరంగవైభవంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అమ్మ వారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది నుంచి రాష్ట్ర పండగగా గుర్తింపునివ్వడం కొత్త ఉత్సాహం నెలకొంది. అమ్మ జాతర ను తొలేళ్ల ఉత్సవంతో శ్రీకారం చుట్టారు. వేకువఝాము నుంచే అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజాదికాలు నిర్వహించారు. పూసపాటి వంశీయులైన అశోక్‌ గజపతిరా జు కుమార్తె అదితి గజపతిరాజు అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు. వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా ఆలయ సం ప్రదాయం ప్రకారం పూజలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపైనా ఉండాలన్నారు. తన తండ్రి అశోక్‌ గజపతిరాజు ప్రస్తుతం  ఐసీయులో ఉన్నారని, మరికొద్దిరోజుల్లో కోలుకుంటారన్నారు. అనంతరం దివంగత ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
  
ఘటాలతో నివేదన 
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నగరంలోని పలువురు భక్తులు వివిధ వేషధారణలతో... డప్పు ల మోతలతో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నా రు. మహిళలు, పురుషులు సైతం అమ్మవారికి ప్రీతిపాత్రమైన.. ఆమె ప్రతిరూపమైన ఘటాలను నెత్తిన పెట్టుకుని అమ్మవారికి నివేదించి తరించారు. తొలేళ్ల ఉత్సవం రోజున ఉదయం నుంచి రాత్రి వరకూ సు మారు 20వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఉచిత సేవలు 
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం పలు స్వచ్చంద సంస్థలు, మంచినీరు, మజ్జిగ ఉచితంగా అందించారు. మరికొందరు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఎన్‌సీసీ, రెడ్‌క్రాస్, క్యాడెట్లు, పోలీస్‌ సేవాదళ్‌తో పాటు పలు సంస్ధలకు చెందిన ప్రతినిధులు భక్తులకు సేవలందించారు.  పండగ నేపథ్యంలో నగరానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ బి.రాజకుమారి సారధ్యంలో పోలీస్‌ యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఎస్పీ సోమవారం ఆలయ పరిసరాలను సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

సంప్రదాయబద్దంగా ఉత్సవం 
సోమవారం రాత్రి  అమ్మవారి చదురుగుడి నుంచి  ఘటాలతో నడుచుకుంటూ పూజారి వెంకటరావుతో పాటు పలువురు పెద్దలు, దీక్షాపరులు కోటలో ఉన్న కోటశక్తికి పూజలు చేశారు. ఆరు ఘటాలను కోట వద్ద నుంచి తిరిగి చదురుగుడికి తీసుకెళ్లి అమ్మవారి చదురువద్ద పెట్టారు. సిరిమానుపూజారి వెంకటరావు అమ్మవారి కథను భక్తులకు వినిపించారు. అనంతరం రైతులకు విత్తనాలను అందజేసి, ఆశీర్వచనాలను అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.   

మరిన్ని వార్తలు