పాలకొండ రూటు..విశ్వసనీయతకే ఓటు..

28 Mar, 2019 11:11 IST|Sakshi

సాక్షి, పాలకొండ రూరల్‌: గిరిజనులు అధికంగా ఉన్న పాలకొండ నియోజకవర్గాన్ని టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచీ ఓటు బ్యాంకుగానే చూసింది. గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తామని 2014 ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించింది. ఇక్కడి ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అంతే అప్పటి నుంచి నియోజకవర్గంపై వివక్ష మొదలైంది. గిరిజన ఉత్పత్తులు, వ్యవసాయ వనరులున్నా ఎటువంటి వ్యవసాయరంగ, పారిశ్రామికీకరణ జరగకపోవటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పంటలకు సాగునీరు లేక, పండిన పంటలకు గిట్టుబాలు లేక ఆవేదన చెందుతున్నారు.  


 నియోజకవర్గ ప్రత్యేకతలు...
1952లో పాలకొండ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఒకే పేరుతో నియోజకవర్గం కొనసాగుతోంది. తొలుత జనరల్‌గా ప్రారంభమై తర్వాత ఎస్సీలకు అనంతరం ఎస్టీలకు కేటాయించారు. 2009లో పునర్విభజనకు ముందు నియోజకవర్గంలో పాలకొండ, రేగిడి, సంతకవిటి, వంగర మండలాలు ఉండేవి. పునర్విభజన అనంతరం కొత్తూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న భామిని, వీరఘట్టం, సీతంపేట మండలాలు పాలకొండలో చేరాయి. ఈ ప్రాంత ప్రజలు వ్యవసాయాధారితంగా జీవనం సాగిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రం పాలకొండ చదువులకు నిలయంగా ఉంది. ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ కొలువుతీరిన ఈ ప్రాంతానికి బ్రిటీష్‌ కాలం నుంచీ చారిత్రక నేపథ్యం ఉంది. వీరఘట్టం కూరగాయల పంటలకు, ఆంధ్రా ఒడిశాలను కలిపే భామిని మండలం, ఏజెన్సీ అందాలకు సీతంపేట ప్రసిద్ధి. 


అభివృద్ధిలో వైఎస్సార్‌మార్క్‌...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పాలకొండ మండలంలో వరద కరటక్టలు, ఎం.సింగుపురంలో పీహెచ్‌సీ భవనం, జంపరకోట మినీ జలాశయం పనులు, అక్కడి నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేశారు. సీతంపేటలో మండలంలో అభివృద్ధి పనులు, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. భామిని మండలానికి సంబంధించి నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి(ఐఏపీ) ద్వారా నిధులు కేటాయించారు. జలయజ్ఞంలో భాగంగా వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4వందల కోట్లు కేటాయింపులు, మారుమూల గ్రామాల్లో పూర్తిస్థాయిలో రహదారుల నిర్మాణం.


విశ్వాసానికే మద్దతు
2009లో అప్పటి ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారి రాజకీయ రంగప్రవేశం చేసిన విశ్వాసరాయి కళావతి 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో నిలిచి టీడీపీపై విజయం సాధించారు. అయితే పార్టీ అధికారంలోకి రాకపోయినా నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి విశ్వాసాన్ని పొందారు.  ఐదేళ్లగా ప్రభుత్వం సహకరించకపోయినా వెరవలేదు. నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తూవచ్చారు. అక్కడి గిరిజనుల, రైతులు తరఫున, ప్రత్యేకహోదా కోసం పోరాటాలు చేస్తూ కళావతమ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిరాయింపుల సమయంలోనూ చలించకుండా విశ్వసనీయత కట్టుబడి నిలబడ్డారు. ఇదే విషయాన్ని పాదయాత్రగా వచ్చిన తమ పార్టీ అధినేత జగన్‌ పాలకొండ బహిరంగ సభలో ప్రస్తావించడం ఈమె నిబద్ధతకు నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు. ఓ వైపు ప్రత్యర్థి పార్టీ నాయకులు, క్యాడర్‌ వైసీపీలోకి వలస రావటం, ప్రజల్లో ఉన్న గుర్తింపును రానున్న ఎన్నికల్లో కళావతి విజయానికి కలిసొచ్చే అంశాలుగా పేర్కొంటున్నారు.


టీడీపీ హయాంలో..
గత ఐదేళ్లగా నియోజకవర్గంలో అభివృద్ధికి గండి పడింది. కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే విశ్వారాయి కళావతికి పేరు రాకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేసింది. స్థానిక ఎమ్మెల్యేకు ప్రాధాన్యత కల్పించలేదు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జికి ప్రాధాన్యత కల్పించి అభివృద్ధి నిధులు ఆయన పేరిట మంజూరు చేసింది. దీంతో వారికి నచ్చిన పనులు, వారికి కనుసన్నల్లో ఉండేవారికి కట్టబెట్టారు. దీంతో పాలనలో లోపాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వంశధార ప్రాజెక్టు నేటికీ పూర్తికాలేదు.  పాలకొండ మండల రైతుల కల అయిన జంపరకోట ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. కిమ్మి – రుసింగి వంతెన పనులకు మోక్షం కలగలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నగర పంచాయతీలో ఇంటి పన్నుల భారం అధికం కావడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.


విమర్శలు మూటగట్టుకున్నారు
తండ్రి నిమ్మక గోపాలరావు మరణంతో టీడీపీ నుంచి 2014లో బరిలో నిలిచిన నిమ్మక జయకృష్ణ 1620 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తండ్రి చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణకు స్వపక్షంలో విపక్షం అసమ్మతి బలహీనంగా మారింది. నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడంలో విఫలమయ్యారు. తాజా ఎన్నికల సమయంలో టికెట్‌ దక్కించుకునే క్రమంలో టీడీపీ వర్గాలు ఈయనకు చుక్కలు చూపించాయి. నామినేషన్‌ సమయంలో కూడా టీడీపీలో కొన్ని వర్గాలు దూరంగా ఉండిపోయాయి. ప్రజల్లో మమేకం కాలేరని, సొంత క్యాడర్‌ను కలుపుకుపోలేరని ఆ పార్టీకి చెందిన నాయకులే ఆరోపిస్తున్నారు. మంత్రి కళా కనుసన్నల్లో పనిచేస్తున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు. పార్టీలో సీనియర్‌ నాయకులు వలస కట్టడం వంటి పరిణామాలు ఈ ఎన్నికల్లో జయకు ఇబ్బందిగా మారనున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు.


పాలకొండ ముఖచిత్రం
1952 నుంచి 2014 వరకు 14సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజాగా నోటిఫికేషన్‌ విడుదల కావడంతో 15వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. 1952 నుంచి 1962 వరకు జనరల్‌ నియోజకవర్గంగా ఉన్న పాలకొండలో 1967 నుంచి 2004 వరకు ఎస్సీ రిజర్వేషన్‌ కొనసాగింది. 2009 నుంచి ఎస్టీ రిజర్వేషన్‌ కొనసాగుతోంది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, ఇండిపెండెంట్లు 4సార్లు, జనతా పార్టీ ఒకసారి, 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయం సాధించింది. ప్రస్తుత 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి విశ్వాసరాయి కళావతి, టీడీపీ నుంచి నిమ్మక జయకృష్ణలు ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.


మొత్తం ఓటర్లు:              1,74,219
పురుషులు:                  86,107
స్తీలు:                          88,100
ఇతరులు:                    12
మొత్తం పంచాయతీలు   104
పోలింగ్‌ బూత్‌లు           283

ఎమ్మెల్యేల వివరాలు
సంవత్సరం                      విజేత                               పార్టీ
1952                    పాలవలస సంగంనాయుడు           కాంగ్రెస్‌
1955                    పైడినరసింహ అప్పరావు              ఇండిపెండెంట్‌ 
1962                    కెంబూరి సూర్యనారాయణ             ఇండిపెండెంట్‌
1967                    జెమ్మాన జోజి                            ఇండిపెండెంట్‌
1972                    కొత్తపల్లి నరసింహయ్య                  కాంగ్రెస్‌
1978                    కంబాల రాజరత్నం                      జనతా పార్టీ
1983                    గోనేపాటి శ్యామలరావు                 టీడీపీ
1985                    తలే భద్రయ్య                             టీడీపీ 
1989                    పీజే.అమృతకుమారి                    కాంగ్రెస్‌
1994                    తలే భద్రయ్య                             టీడీïపీ
1999                    పీజే.అమతకుమారి                     ఇండిపెండెంట్‌
2004                    కంబాల జోగులు                         టీడీపీ 
2009                    నిమ్మక సుగ్రీవులు                   కాంగ్రెస్‌
2014                    విశ్వాసరాయి కళావతి               వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 

మరిన్ని వార్తలు