తప్పు చేశా.. క్షమించండి !

27 Mar, 2019 11:25 IST|Sakshi
డేవిడ్‌రాజుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి  

క్షమాపణలు కోరిన డేవిడ్‌రాజు

టీడీపీ నాయకులు మోసం చేశారంటూ ఆవేదన

సాక్షి, ఒంగోలు సిటీ: ‘‘ నాకు మంచి అవకాశం ఇచ్చిన వైఎస్సార్‌ సీపీని కాదని తెలుగుదేశంలోకి వెళ్లడం తప్పే.. నన్ను క్షమించండి’’ అని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు క్షమాపణ కోరారు. వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఒంగోలులోని బాలినేని నివాసంలో డేవిడ్‌రాజు మంగళవారం వైఎస్సార్‌ సీపీలోకి  తిరిగి చేరారు. ఆయన బాపట్ల పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలినేనిని కలిసి మాట్లాడి, తనను క్షమించాలని కోరారు. బాలినేని పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌ సీపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా డేవిడ్‌రాజు మాట్లాడుతూ తనను తెలుగుదేశం పార్టీ నాయకులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా బాలినేని సహకారంతో గెలిచానని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి అధికార పార్టీలో ఉంటే మేలు జరుగుతుందని చెప్పారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన మాటలు నమ్మి ఆ పార్టీలో చేరానని అన్నారు. తీరా చూస్తే అవేమి జరగలేదన్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకానికి మనిషి కాదని తేలిపోయిందని చెప్పారు. దళితుడినైన తనను నిజాయితీగా మంత్రి శిద్దా రాఘవరావు మాటలు నమ్మి షరతులు లేకుండా తెలుగుదేశంలో చేరానన్నారు.

తనను మంత్రి కూడా మోసం చేశారన్నారు. నమ్మిన వారికి న్యాయం చేయలేని నిస్సహాయతలో ఆయన ఉన్నారన్నారు. మాటిస్తే తప్పని నాయకుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. ఆయన సీఎం అయితే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు.బాలినేని విజయానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తిరిగి రాజకీయ పునర్జన్మను ఇచ్చిన వైఎస్సార్‌ సీపీలో చేరడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే తనయుడు విజేష్‌రాజ్‌ కూడా బాలినేని సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు