పలాస ఎవరికి దక్కునో...?

31 Mar, 2019 09:32 IST|Sakshi

దశాబ్దాలుగా వస్తున్న కుటుంబ రాజకీయ పాలన పలాస నియోజకవర్గంలో ప్రజలను ఆకట్టుకోలేకపోతోంది. 2009 ఎన్నికల్లో మినహా అన్ని ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తున్న గౌతు శ్యామ సుందర శివాజీ.. ఈ సారి తన వారసురాలిగా కుమార్తె శిరీషను ఎన్నికల బరిలో దింపారు. సామాన్య కుటుంబానికి చెందిన వైద్యుడిపై పోటీ పడుతున్న కుటుంబ పాలనకు మరోసారి చెక్‌ పడక తప్పదన్న అభిప్రాయాలు నియోజక వర్గ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.   

సాక్షి, కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలో ఎప్పటినుంచో మార్పును కోరుకుంటున్న ప్రజలు  2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో సాధారణ మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. తిరిగి ఇప్పుడు అధికార పార్టీని, గౌతు కుటుంబాన్ని ఎదిరించి ప్రజాసమస్యలపై నిలబడే నవయువకుడు, వైద్యుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజు రావడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి పలాస నియోజకవర్గ తీరు తెన్నులపై సాక్షి ప్రత్యేక కథనం.


 నియోజకవర్గం పుట్టుక  
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2009వ సంవత్సరంలో పలాస నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది.  పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నప్పటికీ కాశీబుగ్గ పట్టణం, వజ్రపుకొత్తూరు మండలం, టెక్కలి నియోజకవర్గంలో ఉండేవి. పలాస పట్టణం, మందస మండలం సోంపేట నియోజకవర్గంలో ఉండేవి. జీడిపరిశ్రమలు, కార్మికులు ఈ ప్రాంతంలో ఒక్కసారిగా అభివృద్ధి చెందడంతో రెండు పట్టణాలు జిల్లా కేంద్రంతో పోటీ పడుతున్న సమయంలో పలాస నూతన నియోజకవర్గంగా మారింది. మొదటి ఎమ్మెల్యేగా జుత్తు జగన్నాయకులు 2009 ఎన్నికల్లో గౌతు శ్యాంసుందర శివాజీపై గెలుపొందారు. అనంతరం వజ్జ బాబూరావుపై 2014లో శివాజీ గెలుపొందారు. ప్రస్తుతం వజ్జబాబూరావు తన అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి శివాజీ పంచనే చేరారు. ఇప్పుడు శివాజీకి వయసు మీదపడడంతో తన తండ్రి నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవిని మనుమరాలు శిరీషకు అప్పగించేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. 


నియోజకవర్గ ప్రత్యేకత 
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన పలాసకు టూరిస్టు శాఖ ‘వైట్‌ గోల్డ్‌’ సిటీగా నామకరణం పేరుపెట్టింది. పలాస నియోజకవర్గంలో సుమారు 45 కిలోమీటర్లుగల  జాతీయ రహదారి, పలాస వంటి పెద్ద రైల్వేస్టేషన్‌తో పాటు పూండి, మందస, సున్నాదేవి వంటి స్టేషన్‌లతో రైలుమార్గం ఉంది. వజ్రపుకొత్తూరు మండలం సముద్ర తీర ప్రాంతంలో టూరిజంతో పాటు, 32వేల మందికి పైగా మత్స్యకారులకు జీవనాధారమైన చేపలవేటకు అవకాశం ఉంది. మందస మండలంలో అతి ఎత్తైన మహేంద్రగిరి పర్వతాలు ఉన్నాయి. 26 వేల మందికి పైగా గిరిజనులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పలాసతో పాటు మూడు మండలాలను కలుపుకుని ఉద్దాన ప్రాంతం ఉంది. కొబ్బరి, జీడిమామిడి, మునగ, దుంపలు, మామిడి, ఇలా ఉద్యానపంటలు ఇక్కడ అనేకం.  పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 20 వేలమంది పైగా వలస వచ్చి స్థిరపడిన జీడికార్మికులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన 300కుపైగా జీడి పరిశ్రమలు నియోజకవర్గంలో విరాజిల్లుతున్నాయి.


మామ పాలనలో అల్లుడి హవా    
నియోజకవర్గంలో గౌతు శ్యాంసుందర శివాజీ ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాలన కొనసాగించినప్పటికీ ఆయన అల్లుడి హవా ఎక్కువైంది. మామ ఎమ్మెల్యే అయినా ఎవరి పనులనైనా అల్లుడు గారే చేసి పెడతారు. జీడి, రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌కు అల్లుడికి కమీషన్‌ లేనిదే పనులు పూర్తికావు. అనేక మంది వీరిద్దరి పరిస్థితిని గమనిస్తున్నారు. నేరస్తులను వెంట వేసుకుని మూడు మండలాల పరిధిలో భయాందోళనలు సృష్టిస్తున్నారు. అదేవిధంగా ఆఫ్‌షోర్‌ నిర్మాణానికి ఎమ్మెల్యేకు ఉన్న పెట్రోల్‌ బంకు నుంచి   డీజిల్‌ కొనుగోలు చేయాలని అల్లుడు ఒప్పందాలు చేయించుకున్నాడు.  అల్లుడి పోరు ఇంతంత కాదయా అంటూ పరిసర ప్రాంతాల్లో కోడై కూస్తున్నారు.


తిత్లీ పరిహారం దోపిడీ  
తిత్లీ తుఫాన్‌ అధికార జన్మభూమి కమిటీలకు అక్కరకు వచ్చింది.  గత ఏడాది అక్టోబరు 11న సంభవించిన తుఫాన్‌లో నష్టపోయిన వారిలో.. జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన వారికి మాత్రమే పరిహారం అందింది. నిజమైన లబ్ధిదారులకు అందకపోవడంతో అవేదన చెందుతున్నారు.  తుఫాన్‌ ప్రభావతో ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలైన అనేక మందికి పరిహారం అందివ్వకపోవడంతో వారంతా  అనాథలుగా మిగిలారు. పలాస నియోజకవర్గంలో 60 ఏళ్ల గౌతు కుటుంబ పాలన కంటే పదేళ్ల వైఎస్‌ రాజశేఖర రెడ్డి  పాలనలోనే అభివృద్ధి చెందిందని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటారు. నియోజకవర్గంలోని రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు వైఎస్‌ హయాంలో  శంకుస్థాపన చేసి రూ.127కోట్లతో 26వేల హెక్టార్లకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారు. అనంతరం వచ్చిన ప్రçభుత్వాలు చేయలేకపోయాయి. ముఖ్యంగా పలాస–కాశీబుగ్గలో రోడ్డు విస్తరణ, మున్సిపల్‌ కార్యాలయం నిర్మాణం, బెండిగేటు, నువ్వలరేవు, పొత్తంగా వంటి అతి పెద్ద బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యాయంటే దివంగత వైఎస్‌ చలవేనని నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటుంటారు. మున్సిపాలిటీకి తాగునీరు, ఈ ప్రాంతంలో ఉన్న బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చడం, ఇతర కూలాల వర్గీకరణ వైఎస్‌ హయాంలోనే జరిగింది. అలాగే మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలలో మరదరాజపురం, బెండి వంతెనలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణాలను వైఎస్‌ పాలనా కాలంలోనే అధికంగా చేశారు.


పరిష్కారం కాని సమస్యలు      
ఉద్దానంలో ఉన్న 7మండలాల్లో కిడ్నీ మహమ్మరి బారిన పడిన మూడు మండలాలు పలాస  నియోజకవర్గంలో ఉండడం దురదృష్టకరం. ప్రతి వారం కనీసం ఇద్దరు వ్యక్తులు కిడ్నీ సమస్యతో మరణిస్తున్నారు. వేలాది మంది కిడ్నీ రోగులు ఉండగా కేవలం 223మందికి మాత్రమే పింఛన్లు  ఇచ్చి డయాలసిస్‌ కేంద్రం పెట్టి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది.  పలాస ప్రభుత్వ ఆస్పత్రిని 200 పడకలకు విస్తరించలేక విడిచి పెట్టేశారు. ఆస్పత్రిలోని మేల్‌వార్డునే డయాలసిస్‌ సెంటర్‌గా మార్చివేశారు. ప్రభుత్వ డిగ్రీకళాశాలను స్థానిక అధికార పార్టీ నేతలు  చేతులారా వదులుకున్నారు. కాశీబుగ్గ వంతెన పూర్తి చేయలేక చేతులెత్తేశారు. హుద్‌హుద్‌ ఇళ్లు, ఏహెచ్‌పీ ఇళ్ల పంపిణీ చేయలేక విడిచిపెట్టేశారు. జంట పట్టణాలకు తాగునీరు, వజ్రపుకొత్తూరు మండలానికి వంశధార నీరు అందించలేకపోయారు.


మొత్తం ఓటర్లు  : 1,91,562
పురుషులు      : 94827
్రïస్తీలు            : 96699
ఇతరులు         : 36 
మండలాలు: మందస, పలాస, వజ్రపుకొత్తూరు
మున్సిపాలిటీ    :    పలాస–కాశీబుగ్గ
పోలింగ్‌ కేంద్రాలు              :     278
సమస్యాత్మక కేంద్రాలు     :     37    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు