చీఫ్‌ విప్‌లుగా పల్లె, పయ్యావుల..

15 Nov, 2017 09:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నియమితులయ్యారు. శాసన సభలో ఇప్పటికే నలుగురు ఉన్న విప్‌లకు అదనంగా మరో ఇద్దరికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే  అసెంబ్లీ విప్‌లుగా గణబాబు, సర్వేశ్వరరావు, ఇక శాసనమండలి చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, విప్‌లుగా బుద్దా వెంకన్న,డొక్కా మాణిక్య వరప్రసాద్‌, రామసుబ్బారెడ్డి, షరీఫ్‌ల నియామకం జరిగింది. నియామకానికి సంబంధించిన బుధవారం జీవో విడుదల అయింది. కాగా  పల్లె రఘునాథరెడ్డి తొలిసారి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీ, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు. ఇప్పుడు తిరిగి చీఫ్‌ విప్‌గా ఎంపికయ్యారు.

మరోవైపు  పయ్యావుల కేశవ్‌ తొలిసారి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో ఓటమిపాలయ్యారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014లో ఓటమి చవిచూశారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. అప్పుడు కూడా చంద్రబాబు మొండిచేయి చూపారు. దీంతో కేశవ్‌ తీవ్ర నిరాశ చెందినా.. చివరకు మండలి చీఫ్‌విప్‌ పదవిని కట్టబెట్టారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు