పల్లెలిక పరిశుభ్రం

10 Nov, 2013 01:48 IST|Sakshi

 

=ఉపాధి హామీలో డంపింగ్‌యార్డుల ఏర్పాటు
 =వ్యవసాయ పనులకూ పచ్చజెండా
 =కల్లాల ఎత్తు, ఇసుక మేటల తొలగింపు పనులకు ప్రాధాన్యం
 =గుర్తింపు పనిలో అధికార బృందాలు

 
సాక్షి, విశాఖపట్నం: పంచాయతీల్లో పేరుకుపోతున్న చెత్తకు మోక్షం కలగనుంది. ఇందు కోసం గ్రామ శివారులో ప్రత్యేక డంపింగ్ యార్డ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఉపాధి హామీ పథకంలో వీటి తవ్వకాలు చేపడతారు. వేతనదారులతో నిర్వహణ చేపట్టనున్నారు. ఈమేరకు పంచాయతీల వారీగా పనులు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. తొలి విడతగా జిల్లాలో 256 పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపడతారు. దశల వారీగా మిగతా పంచాయతీల్లోనూ ప్రారంభిస్తారు.

ముఖ్యంగా పంచాయతీల్లో డంపింగ్ యార్డ్ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెత్త తరలింపు సక్రమంగాలేక పల్లెల్లో పారిశుద్ధ్యం కొరవడుతోంది. వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ప్రజారోగ్యానికి పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పరిస్థితి మరీ దయనీయంగా మారింది. దీన్నిదృష్టిలో ఉంచుకుని పంచాయతీల్లో డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉపాధి నిధులతో తొలుత డంపింగ్ యార్డ్‌లు తవ్వుతారు. దీంతో ఆయా గ్రామాల్లో పలువురికి పని కల్పించడంతోపాటు పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది. ఉపాధి పనులంటే చెరువు పనులే అని పల్లెల్లో చెప్పుకునే పరిస్థితి.

ఇతరత్రా పనులు అనేకం ఉన్నప్పటికీ అటు అధికారులు, ఇటు వేతనదారులు ఇంతకాలం వీటిపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో గతంలో చేపట్టిన చోటే పనులు నిర్వహించడంతో అనేక చోట్ల అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పనులపై దృష్టి సారించాలని, వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని తాజాగా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా పంచాయతీల్లో డంపింగ్ యార్డ్‌లు, వరదలకు పూడుకుపోయిన కల్లాలను ఎత్తు చేసుకునే పనులు, పొలాల్లో ఇసుక మేటల తొలగింపు, చెరువుల గండ్లు పూడ్చివేత, గట్లు పటిష్టం, ఇందిరమ్మ కాలనీల లోతట్టు ప్రాంతాల్లో మట్టి ఫిల్లింగ్ పనులు, పాఠశాల/ఆసుపత్రుల పరిసరాల అభివృద్ది పనులు చేపట్టాలంటూ స్పష్టంగా ఆదేశాలు జారీ అయ్యాయి.

దీంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. ఒక టెక్నికల్ అసిస్టెంట్,ఒక నాన్ టెక్నికల్ అసిస్టెంట్, ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లతో కూడిన బృందాలు గ్రామాల వారీ పనులు గుర్తింపు పనిలో నిమగ్నమయ్యాయి. ఈనెల 25వ తేదీలోగా పనులు గుర్తించి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నారు. డంపింగ్ యార్డ్‌ల నిర్వహణ కోసం ప్రతి కుటుం బానికి ఏడాదిలో 180 పని దినాలు కల్పిస్తారు. నెల వారీగా చూసుకుంటే 15 రోజుల పని ఉంటుంది. రోజుకి రూ.150చొప్పున వేతనం చెల్లిస్తారు. అటు పని కల్పించినట్టు అవుతూనే మరోవైపు పంచాయతీల్లో చెత్త సమస్య పరిష్కారమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే తరహాలో వ్యవసాయ భూములకు, రైతులకు ఉపయోగ పడే పనులు చేపడుతారు.
 

>
మరిన్ని వార్తలు