పాల్మన్‌పేట నిందితులకు రిమాండ్

30 Jun, 2016 04:11 IST|Sakshi
పాల్మన్‌పేట నిందితులకు రిమాండ్

32 మందిని యలమంచిలి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు
కిక్కిరిసిన కోర్టు ప్రాంగణం

 
యలమంచిలి/పాయకరావుపేట: సంచలనం కలిగించిన పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట దాడుల ఘటనకు సంబంధించి 32 మంది నిందితులను బుధవారం యలమంచిలి కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. ఒక సామాజికవర్గం వారు పాల్మన్‌పేటలో మరో సామాజిక వర్గానికి చెందిన వారిపై అమానుషంగా దాడులు, విధ్వంసానికి తెగబడిన సంగతి తెలిసిందే.  ప్రాథమికంగా దాడులతో ప్రమేయం ఉన్నవారిని గుర్తించిన పోలీసులు వారిని యలమంచిలి ఏజేఎఫ్‌సీఎం కోర్టుకు ప్రత్యేకం  బస్సులో తరలించారు. న్యాయమూర్తి యజ్ఞనారాయణ ఎదుట నిందితులను హాజరుపరచగా 32 మంది నిందితులకు వచ్చే నెల 13వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం నిందితులందరినీ అదే బస్సులో విశాఖ కేంద్ర కారాగారానికి భారీ బందోబస్తు నడుమ తరలించారు. మరి కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కూడా గురువారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.


యలమంచిలి కోర్టుకు పెద్ద సంఖ్యలో నిందితులను తరలించడంతో కోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిందితులు, వారి తరపు న్యాయవాదులు, కొందరు గ్రామ పెద్దలు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు.

 మొత్తం 58 మంది అరెస్టు
 పాయకరావుపేట మండలంలోని పాల్మన్‌పేట గ్రామస్తులపై దాడుల సంఘటనకు  సంబంధించి 58 మందిపై 5 కేసులు నమోదుచేసి అరెస్టు చేసినట్లు నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగీ తెలిపారు. ఆయన బుధవార ం పాయకరావుపేటలో  విలేకర్లతో మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగు కేసులు, గాయపడ్డ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదుచేశామన్నారు.

మరిన్ని వార్తలు