‘టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు’

11 Mar, 2020 10:05 IST|Sakshi

సాక్షి,విశాఖపట్నం : జిల్లాలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు ఆ పార్టీకి గుడ్‌బాయ్‌ చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే కార్యకర్తలు అభిమానులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి రమేష్‌ బాబు తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయడం టీడీపీ పెద్దలకు రుచించలేదని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. విశాఖ క్యాపిటల్‌గా వ్యతిరేకిస్తే నష్టపోతామని చెప్పినట్లు, టీడీపీ పెద్దలు నా మాటలను పక్కన పెట్టారని వాపోయారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని తనకు చెప్పారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు.

రాజధానిగా విశాఖ వద్దనడం సరికాదని రమేష్‌ బాబు హితవు పలికారు. వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని కోరారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు తాము ఒప్పుకున్నామని, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు 23 సీట్లు ఇచ్చిన దానిపై చంద్రబాబు ఎప్పుడైనా చర్చించారా అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపుదారులను మంత్రులను చేయడం ప్రజలు అంగీకరించలేదని తెలిపారు. టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని రమేష్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
(టీడీపీకి షాక్‌: వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు)

కాగా మంగళవారం మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన కుమార్తె డాక్టర్‌ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌ కుమార్‌, టీడీపీ నాయకులు గుడ్ల సత్యారెడ్డి, విజయసాయి, వ్యాపారవేత్త చిక్కాల రవి నాయుడు, పి.ఉషశ్రీ, జనసేన సీనియర్ నాయకులు పివి సురేష్, కొణతాల సుధ తదితరులు వైఎస్సార్‌సీపీలోకి చేరిన విషయం తెలిసిందే. వారికి విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు