అలా వస్తున్నారు..ఇలా వెళ్తున్నారు!

29 Mar, 2018 13:58 IST|Sakshi
బదిలీకి గురైన బీవీ రమణ

రాజాం నగర పంచాయతీలో

కొనసాగుతున్న బదిలీల పర్వం

రెండు నెలలుగడవకముందే

కమిషనర్‌పై బదిలీ వేటు

చక్రం తిప్పిన టీడీపీ నేతలు

రెండేళ్లుగా ఇదే తంతు

రాజాం సిటీ: రాజాం నగర పంచాయతీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.వి.రమణపై బదిలీ వేటు పడింది. ఈయన గత నెల 2న ఇక్కడ విధుల్లో చేరగా.. 56 రోజులకే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. అది కూడా గ్రేటర్‌ విశాఖ నగరపాలక సంస్థలో ఎగ్జిస్టింగ్‌ పోస్టుకు బదిలీచేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈయన 2008 లోనూ ఇక్కడ నగర పంచాయతీ కమిషనర్‌గా రెండేళ్ల పాటు విధులు నిర్వర్తించారు. నగర పంచాయతీ ఆవిర్భావ సమయం కావడంతో తనదైన శైలిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ రాజాం పట్టణానికి వన్నెతెచ్చారు. అటువంటి కమిషనర్‌పై ఇప్పుడు రెండు నెలలు గడవకముందే బదిలీవేటు పడటం చర్చనీయాంశమైంది. 

టీడీపీ నేతల కనుసన్నల్లోనే..
రాజాం నగర పంచాయతీ పాలన మొత్తం గతంలో టీడీపీ సీనియర్‌ నేత కావలి ప్రతిభాభారతి కనుసన్నల్లోనే జరిగేది. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో నగర పంచాయతీ కమిషనర్‌ ఏర్పాటు నుంచి కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకునే వరకు అన్నీ ఈమె ఆధ్వర్యంలోనే జరిగేవి. ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయిన తర్వాత పరిస్థితి కాస్త భిన్నంగా మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే బీవీ రమణ కంటే ముందు ఎస్‌.వెంకటరమణ కమిషనర్‌గా నియమితులై వారం రోజులు కూడా పనిచేయకుండా సెలవు పెట్టడం, అనంతరం బదిలీకావడం జరిగిపోయాయి. అప్పట్లో ఇది చర్చనీయాంశం కాగా అనంతరం నగర పంచాయతీ ఏఈ జి.సురేష్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా విధులు కొనసాగించారు. ఫిబ్రవరి 2న బీవీ రమణ నగరపంచాయతీ కమిషనర్‌గా విధుల్లో చేరగా రెండు నెలలు గడవకముందే బదిలీ కావాల్సి వచ్చింది. స్థానికంగా జరుగుతున్న పనుల విషయంలో నియమ నిబంధనలు పాటించడం, పలు అంశాల్లో పట్టణవాసుల తరఫున వ్యవహరించడం కారణంగా ఈయనకు అధికార పార్టీతో విభేదాలు ఏర్పడినట్లు తెలిసింది. పనుల విషయంలో గతంలో పనిచేసిన కమిషనర్లకు భిన్నంగా వ్యవహరించడంతో టీడీపీ నాయకుల అండ కనుమరుగైంది. ఫలితంగా బదిలీ వేటు తప్పలేదనే ప్రచారం జరుగుతోంది.

రెండేళ్లుగా ఇదే తీరు..
రాజాం నగర పంచాయతీకి సంబంధించి రెండేళ్లుగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండేళ్ల క్రితం నగర పంచాయతీ కమిషనర్‌గా పి.సింహాచలం విధులు నిర్వహించగా 2016లో ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో ఆయన్ను  బదిలీ చేయించారు. అనంతరం ఆమదాలవలసలో విధులు నిర్వహిస్తున్న కమిషనర్‌ బి.రామును ఇక్కడకు బదిలీపై తీసుకువచ్చి ఎఫ్‌ఏసీ బాద్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బదిలీల్లో ఎస్‌.వెంకటరమణ ఇక్కడ కమిషనర్‌గా రాగా బి.రాము రాజాం ఎఫ్‌ఏసీ విధులు నుంచి వైదొలగాల్సి వచ్చింది. వెంకటరమణ కూడా ఇక్కడ ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు. ప్రస్తుతం బీవీ రమణ పరిస్థితి కూడా ఇదే స్థితికి వచ్చింది. అసలే పాలకమండలి లేక విలవిలలాడుతున్న నగర పంచాయతీలో అధికారపార్టీ పెత్తనం నగరపంచాయతీ కమిషనర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు