ప్రతి సేవకూ ఓ రేటు

20 Apr, 2016 00:26 IST|Sakshi

 కడియం : తాను చేయాల్సిన పనులకు సైతం ఓ రేటు పెట్టి వసూలు చేస్తున్నాడో పంచాయతీ డివిజన్‌స్థాయి అధికారి. తాను విధులు నిర్వహించేదే డబ్బుకోసమన్న రీతిలో వ్యవహరిస్తున్న ఆయన తీరుకు రాజమహేంద్రవరం డివిజన్‌లో పలువురు పంచాయతీ సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఆయన నుంచి ఫోనొస్తే సిబ్బంది జేబులు తడుముకోవాల్సి వస్తోంది. ఉదయం టిఫిన్ మొదలుకుని సాయంత్రం డిన్నర్ వరకు పంచాయతీల్లోనే కానిచ్చేస్తున్న ఆ అధికారి గురించి ఆ శాఖలోనే పలువురు చెప్పుకుంటున్నారు.
 
 ఈయన వచ్చిన ఆర్నెల్లలో పరిశీలించిన పంచాయతీల్లో ఏవైనా అవకతవకలు గుర్తించారా? అంటే ఏమీ లేదు. ఆర్థిక సంఘం నిధులను నిర్దేశించిన నిబంధనల మేరకే ఖర్చు చేయాలని, కానీ పలు పంచాయతీల్లో విద్యుత్ పరికరాల కొనుగోళ్లకు వీటిని వినియోగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి పరిశీలనలో ఇటువంటి అంశాలేవీ బయటపడకపోవడంతో ఆయన
 ‘పరిశీలన’ వెనకున్న పరమార్ధం అర్ధం చేసుకోవచ్చు.
 
 అధికారి దందాలో మచ్చుకు కొన్ని..
 రాజమహేంద్రవరంలో తాను అద్దెకుంటున్న ఇంటికి ఏసీ ఏర్పాటు చేయాలని ఆలమూరు మండలంలోని పంచాయతీలను ఆయన ఆదేశించారు. దాంతో పంచాయతీకి రూ. 2వేలు చొప్పున వసూలు చేసి రూ. 30వేలను సిబ్బంది ఆయనకు ముట్టచెప్పారు.
 
 సాధారణంగా చిన్న పంచాయతీలను డివిజన్ స్థాయి అధికారులు పరిశీలించడం అరుదు. కానీ రికార్డుల తనిఖీల పేరుతో ఈయన వచ్చి చిన్నా పెద్దా తేడా లేకుండా పంచాయతీకి రూ. 10వేలు చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
 
 ఆయన రావడమంటూ జరిగే అసలు తాంబూలానికి ముందే రూ. 2వేలు డీజిల్ ఖర్చులు వసూలు చేస్తారట. ఆయనకు నచ్చితే విలువైన వీధిదీపాలను తీసుకుపోతారట. కడియం మండలంలోని ఒక మేజర్ పంచాయతీ నుంచి ఖరీదైన ఎల్‌ఈడీ లైటు, నియోన్‌లైట్‌తో సహా దాదాపు రూ. పదివేల విలువైన వస్తువులను ఆ ఆఫీసరు వారి కారులోకి, అక్కడి నుంచి ఇంటికి తరలించారట.  
 
 ఇంటినుంచి బయలుదేరిన ఆయన టిఫిన్ ఒక పంచాయతీలోను, మధ్యాహ్న భోజనం మరోచోట, సాయంత్రం స్నాక్స్ ఇంకోచోట చేసే విధంగా పకడ్బందీ ప్లాన్‌తో ఉంటారని తెలుస్తోంది. ఆయన సాయంత్రం టీతోపాటు స్నాక్స్‌లో తప్పని సరిగా వేడివేడి బజ్జీలు ఉండాల్సిందేనట.  లేకపోతే అడిగి మరీ తెప్పించుకుంటారని సిబ్బంది చెప్పుకుంటున్నారు.  
 
 కొబ్బరి మొక్కలంటే ఆయనకు మహాప్రీతి. కడియం మండలంలో నర్సరీలను చూసేందుకొచ్చిన ఆయన ఎంపిక చేసిన రకం కొబ్బరి మొక్కలను పంపించేసరికి ఇక్కడి క్షేత్రస్థాయి సిబ్బందికి తలప్రాణం తోకకొస్తోందట.
 
 జిల్లాస్థాయి ఇన్‌చార్జి అయిపోదామని ప్రయత్నించిన ఆయనకు ఆ యోగం త్రుటిలో తప్పిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. ఒకవేళ అయ్యుంటే తమ పరిస్థితి ఇంకెలా ఉండేదోనని అనుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు