ఇక స్థానిక సమరం!

14 Apr, 2019 09:46 IST|Sakshi
పంచాయతీ కార్యాలయం

సార్వత్రిక సమరం ముగిసింది. ఇంకా ఫలితాలు వెలువడటానికి మరో నలభైరోజుల వ్యవధి ఉంది. ఈలోగా స్థానిక సమరానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. పంచాయతీలు, మునిసిపాలిటీలకు కొత్త పాలకవర్గాల ఏర్పాటుకోసం రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఓటర్ల జాబితాలను తయారు చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. మే ఒకటో తేదీలోగా మునిసిపాలిటీల స్థాయిలో... మే పదోతేదీలోగా పంచాయతీలవారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

విజయనగరం రూరల్‌: సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అప్పుడే స్థానిక సంస్థల సంగ్రామానికి తెరలేచింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు,   నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల పాలకమండళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతోంది. మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలలో వినియోగించిన ఓటరు జాబితాలను వా ర్డుల వారీగా విభజించి, ఓటరు ఫొటోతో కూడిన జాబి తాలను సమగ్ర వివరాలతో రూపొందించాలని అందరు కమిషనర్లకు ఈసీ నుంచి ఆదేశాలువచ్చాయి. వీటికి సం బంధించి ఇంకా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది.

మే 1లోగా మునిసిపాలిటీల్లో వార్డుల విభజన
మునిసిపాలిటీల్లో అసెంబ్లీ ఓటర్ల జాబితాలకు అనుగుణంగా వార్డుల విభజన చేపట్టాలని ఆదేశాలిచ్చారు. మే ఒకటి లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్, నగరపాలక సంస్థల కమిషనర్లకు ఆదేశాలొచ్చాయి. వార్డుల వారీ ఓటర్ల విభజన కోసం కొత్త ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటారు. జిల్లాలో విజయనగరం సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీతో పాటు  సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు ఉండగా.. నెల్లిమర్ల నగర పంచాయతీగా ఉంది.

ఇందులో నెల్లిమర్ల నగర పంచాయతీకి మినహా మిగిలిన వాటన్నింటికీ ఎన్నికలు జరిగాయి. జూలై రెండో తేదీతో ఆయా పాలకవర్గాల గడువు పూర్తవుతుంది. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల ప్రకారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు జిల్లా కలెక్టర్‌ ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాలను సేకరించి ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది ప్రకటిస్తారు. జిల్లాలో ఉన్న ఐదు పట్టణాల్లో రెండింటి ఎన్నికల నిర్వహణకు అవాంతరాలు ఉండగా... వాటిపై  మున్సిపల్‌ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది.

ఆరేళ్లుగా పాలకవర్గం లేని నెల్లిమర్ల
జిల్లాలోని నెల్లిమర్ల ప్రాంతం నగర పంచాయతీగా రూపాంతరం చెంది ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎన్నికలకు నోచుకోలేదు. 27వేల జనాభా, 18వేల ఓట్లు ఉన్న నెల్లిమర్ల, జరజాపుపేట మేజర్‌ గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ 2013 మార్చి 21న నగర పంచాయతీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు  నగర పంచాయతీకి ప్రత్యేక అధికారులే తప్ప పాలకవర్గం లేకపోవటం గమనార్హం. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్న తరుణంలో ఈ సారైనా ఎన్నికలు జరుగుతాయో లేదో నన్న అయోమయం అక్కడ నెలకొంది.

ఇక విజయనగరం కార్పొరేషన్‌
విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నుంచి సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీకి చేరుకుంది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 2,44,598 మంది జనాభా ఉన్నారు. అయితే ఇవే ప్రామాణికాలతో 2015 సంవత్సరం జూలై నెలలో సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా... స్థానిక పాలకులు తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఉత్తర్వులను అమల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు.

వారి పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఉత్తర్వులను ఎబియన్స్‌లో ఉంచేందుకు ప్రభుత్వంపై  ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యేకంగా జీఓ తీసుకువచ్చారు. అప్పట్లో ఉన్న అధికార టీడీపీ సైతం  ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగిసేంత వరకువిజయనగరం సెలక్షన్‌గ్రేడ్‌ మున్సిపాలిటీగా కొనసాగుతుందని, పదవీ కాలం పూర్తయిన మరుక్షణం  కార్పొరేషన్‌ హోదా వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్‌లకు ఎన్నికల నిర్వహణపై సమాయత్తం కావటంతో మరోసారి కార్పొరేషన్‌ హోదా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మరలా విలీన ప్రాంతాలతో వార్డుల విభజన తదితర అంశాలపై అధికార యంత్రాంగం పెద్ద కసరత్తు చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం సెలక్షన్‌గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరాన్ని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాల్సి వస్తే పట్టణ పరిధి పెరగటంతో పాటు ప్రస్తుతం ఉన్న 40 వార్డుల సంఖ్య 55 నుంచి 60కు చేరే అవకాశం ఉంది.

పంచాయతీవారీ ఓటర్ల జాబితాలు
రాష్ట్రంలో పంచాయతీ పోరుకు సిద్ధమయ్యేలా పంచా యతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితా వచ్చే నెల 10 నాటికి ప్రచురించాలని ఎన్నికల కమిషన్‌ నుంచి జిల్లా అధికారులకు  ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గతంలో సిద్ధం కాకపోవడంతో పంచాయతీ పాలన ప్రత్యేకాధికారుల ఆధీనంలోకి వెళ్లింది. జిల్లాలో ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికలకు అయ్యే వ్యయ వివరాలను ప్రభుత్వం అధికారుల నుంచి సేకరించింది.  ఇందుకు రూ. 9కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. 2018 అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే పంచాయతీ ఓటర్ల జాబితా గతేడాది మే, జూన్‌ నెలల్లో రూపొందించారు.  2018 జూన్‌ 15న 34 మండలాల్లో 920 పంచాయతీల ఓటర్ల జాబితాలను ప్రచురించారు. అయితే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో తాజాగా మే 10 నాటికి  ఓటర్ల జాబితా రూపొందించా లని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. 2019 జనవరి 1 నాటికి అసెంబ్లీ ఓటర్ల సంఖ్య ఆధారంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని ఆదేశాలు వచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తెలిపారు.

ఖరారు కాని రిజర్వేషన్లు
పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ల అంశం సందిగ్ధంగా మారుతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మించడానికి లేదు. 2013లో ఎస్టీ 8.5 శాతం, ఎస్సీ 18.25 శాతం, బీసీలు 34 శాతం ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి 50 శాతం దాటకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు ఎన్నికలు నిర్వహిస్తే ఎటువంటి అవరోధం ఉండదు. ఏమైనా మార్పు చేయాల్సి వస్తే కేంద్రం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.  

ఆదేశాలు రావాలి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలువచ్చాయి. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయనున్నాం. విజయనగరం సెలక్షన్‌గ్రేడ్‌ మున్సిపాలిటీకి   కార్పొరేషన్‌ హోదా కల్పించిన తరువాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజెప్పి, వారి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తాం. – ఎస్‌.ఎస్‌.వర్మ, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ.

మరిన్ని వార్తలు