జూన్, జూలైల్లో పంచాయతీ ఎన్నికలు

25 Oct, 2017 01:19 IST|Sakshi

ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జూన్, జూలై నెలల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనరు కార్యాలయాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఎన్‌. రమేష్‌కుమార్‌ లేఖ రాశారు. ప్రస్తుత గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టు 1వ తేదీకి ముగియనున్న దృష్ట్యా భారత రాజ్యాంగంలోని 243 ఈ (3) (ఏ) నిబంధన ప్రకారం పదవీ కాలం ముగిసేలోపే తదుపరి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం–1994 ప్రకారం పాత సర్పంచుల పదవీ ముగిసే మూడు నెలల ముందు వీలును బట్టి ఎప్పుడైనా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్పి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టాన్ని అనుసరించి గ్రామ పంచాయతీలకు తాజాగా ఎన్నికల నిర్వహణ అవసరమైన ముందస్తు కసరత్తు ప్రణాళికను ఆయన లేఖలో పొందుపరి చారు. కొత్త పంచాయతీల ఏర్పాటు, ఇప్పుడు గ్రామ పంచాయతీల విలీనం తదితర ప్రక్రియలను పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు నాటికి ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీల జాబితాను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లు ఇందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

వచ్చే ఏడాది జనవరి నెలాఖరులోగా ఎన్నికలు జరిపే గ్రామ పంచాయతీల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డుల రిజర్వేషన్ల వివరాలను మే  నెలాఖరు కల్లా ప్రకటించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే జూన్, జూలైల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతుందని లేఖ లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12,920 గ్రామ పంచాయతీలకు విడతల వారీగా ఎన్నిక నిర్వహిస్తామని, నోటిఫికేషన్‌ విడుదల చేసిన 30 రోజుల కల్లా ఎన్నికల ఫలితాలను ప్రకటించే విధంగా ఎన్నికల నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు