హింసాత్మకం

1 Aug, 2013 06:13 IST|Sakshi

సాక్షి, గుంటూరు : మూడో దశలో భాగంగా పంచాయతీ ఎన్నికలు బుధవారం నరసరావుపేట డివిజన్‌లో జరిగాయి. ఈ డివిజన్‌లో 119 ఫ్యాక్షన్ గ్రామాలున్నాయి. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా కచ్చితంగా పలు గ్రామాల్లో ఘర్షణలు, బాంబు దాడులు, బ్యాలెట్ బాక్సుల అపహరణలు జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్ని ముందే గుర్తించిన పోలీసు అధికారులు అత్యంత సమస్యాత్మక గ్రామాలు గా గుర్తింపు పొందిన ఆరు చోట్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘానికి మూడు రోజుల కిందటే నివేదిక పంపారు.
 
 
 దీంతో రొంపిచర్ల, ముత్తనపల్లి, తూబాడు, శిరిగిరిపాడు, కండ్లకుంట, ఇక్కుర్రు గ్రామాల్లో బుధవారం జరగాల్సిన ఎన్నికల్ని అధికారులు వాయిదా వేశారు. అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా పేరున్న మిగతా చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం పోలీసులు, అధికారులకు సవాలుగా మారింది. అనుమానమున్న గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బాంబులు, మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గొడవలకు కారణమవుతారని ముందే గుర్తించిన ఎంతో మందిని ఆర్డీవో ఎదుట బైండోవర్ చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, బుధవారం గ్రామాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి.
 
 పెదరెడ్డిపాలెంలో.. నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాల్లోకి  చొరబడ్డారు. అడ్డుకున్న ఎస్‌ఐ భూపతిరావు, కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి  ఐదు పోలింగ్ బాక్సులను ఎత్తుకెళ్లి సమీపంలోని బావిలో పడేశారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువైపులా గాయపడ్డారు. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిమిషాల వ్యవధిలోనే పోలీస్ బలగాలు గ్రామానికి చేరి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలు ములకలూరులో గంట సేపు రాస్తారోకో నిర్వహించారు.
 
 సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ పెదరెడ్డిపాలెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మల్లవోలు,గొట్టిపాళ్లలలో.: మాచవరం మండలం మల్లవోలులో రెండు వర్గాలు ఘర్షణలకు పాల్పడ్డారు.  బీరు బాటిళ్లు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఓ ఓటు విషయంలో కాంగ్రెస్,టీడీపీ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసినట్టు చెపుతున్నారు. వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో తొలగించిన ఓట్ల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముందు రాళ్లు ఆ తరువాత కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇరువైపులా ఐదుగురికి గాయాలయ్యాయి. ఇరువర్గాలకు చెందిన 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
 
 వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపొందారని.: బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో వైఎస్సార్ సీపీ మద్దతు తెలి పిన అభ్యర్థి 25 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితాన్ని ప్రకటించాల్సి ఉందనగా కాంగ్రెస్, టీడీపీ మద్దతుదారులు బ్యాలెట్ బాక్సుల్ని ధ్వంసం చేశారని సమాచారం. దుర్గి మండలం ఆత్మకూరులో 25 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతు తెలిపిన అభ్యర్థి సర్పంచ్‌గా గెలిచారు. అయితే ఇక్కడ మంచి పోటీనిచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులపై మండిపడ్డ ఆపార్టీ కార్యకర్తలు రాత్రి 7.30 గంటల సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లపై రాళ్లు, సీసాలతో దాడులకు పాల్పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
 
 పోలీస్ అధికారులపై కలెక్టర్ సీరియస్...
 జిల్లాలో మూడు విడతల్లో జరిగే ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎంతగానో ఆశించిన జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ బుధవారం పెదరెడ్డిపాలెంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనతో అవాక్కయ్యారు. తాను ఏదైతే జరగకూడదని ఆశించారో అదే జరగడంతో పోలీస్ అధికారులపై సీరియస్ అయ్యారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీస్‌బందోబస్తు, సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
 
 మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతం...
 నరసరావుపేట డివిజన్‌లోని మిగతా మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఉదయం 9 గంటలకల్లా డివిజన్‌లో 37.55 శాతం పోలింగ్ జరిగింది. మాచర్ల మండలం కంభంపాడులో సాంబశివరావు అనే ఉద్యోగి ఓటర్లను ప్రలోభపెడుతున్నాడని ఒక గ్రూపు నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 శావల్యాపురం మండలం మతుకుమల్లిలో ఏడుకొండలు అనే ఆదర్శరైతు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థికి పోలింగ్ ఏజెంటుగా బూత్‌లో కూర్చున్నారని టీడీపీ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన్ని బయటకు పంపారు.
 
 దాచేపల్లి జెడ్పీ హైస్కూల్లో ఓట్లు వేసేం దుకు క్యూలో నిలబడిన ఓటర్లను సర్పంచ్ అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించడం కనిపించింది. దీన్ని గమనించిన డీఎస్పీ రాజ్‌కుమార్ ఆ ఇద్దరికీ హెచ్చరికలు చేసి బయటకు పంపారు. మావోయిస్ట్‌ల ప్రాబల్యమున్న గ్రామంగా పేరున్న అడిగొప్పుల పోలింగ్ కేంద్రాల వద్ద డీఎస్పీ మెహర్‌బాబు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు