ఏమిటీ బదిలీలలు?

25 Jul, 2017 06:05 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ సిబ్బంది ఒకే చోట ఎక్కువ కాలం పనిచేస్తే ప్రలోభాలకు లొంగుతారని, పరిపాలనా వ్యవస్థ గాడి తప్పుతుందని బదిలీలు నిర్వహిస్తారు. మరి ఆ బదిలీలే గాడితప్పితే? జిల్లాలోని పంచాయతీరాజ్‌ శాఖలో అదే జరిగింది. ఆ శాఖ బదిలీల్లో ఉద్యోగుల లీలలు ఔరా అనిపించేలా ఉన్నాయి. బదిలీ అయిన చోట నుంచి కదలకుండా తిరిగి అక్కడే డెప్యుటేషన్‌ వేయించుకుని తిష్ట వేశారు కొందరు ఉద్యోగులు.

మరి కొందరు కుంటి సాకులతో బదిలీ నుంచి తప్పించుకున్నారు. ఎక్కడకు బదిలీ చేస్తే ఏమవుతుందంటూ సిబ్బంది తిరిగి తాము కోరుకున్న చోటకే వెళ్లిపోతుంటే ఇక బదిలీలకు అర్ధమేముందని ఆ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నా అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు. బదిలీ నిబంధనలకు తిలోదకాలిచ్చి తమకు నచ్చినట్టు వ్యవహరిస్తున్న పంచాయతీ రాజ్‌ సిబ్బందికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బదిలీ అయినా...
జిల్లాలో డీపీఓ కార్యాలయం, రెండు డివిజనల్‌ పంచా యతీ కార్యాలయాలున్నాయి. వీటితో పాటే 15 మేజర్‌ పంచాయతీలూ ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలోని 921 పంచాయతీల్లోని కార్యదర్శులు, సిబ్బంది, అధికా రులకు గడచిన మే నెలలో బదిలీలు నిర్వహించారు. వారికి కేటాయించిన చోట విధులు నిర్వర్తించాల్సిన అధికారులు, సిబ్బంది డెప్యుటేషన్‌పై మళ్లీ పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు.

∙కొండపాలెం పంచాయతీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కనకరాజును ఎస్‌.కోట బదిలీ చేశారు. ఇతనిని డెప్యూటేషన్‌పై తిరిగి కొండపాలెంలోనే కొనసాగిస్తున్నారు. ∙చీపురుపల్లి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఎస్‌.కోట శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా రెండు నెలల క్రిందటే బదిలీ అయింది. ఆయన నేటికీ చీపురుపల్లిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

∙గర్భాం పంచాయతీలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న స్వామికి జామి మండల కేంద్రానికి బదిలీ అయినా ఇంకా గర్భాంలోనే పనిచేస్తున్నారు.

బదిలీ అయిన చోటే పనిచేయాలి
పంచాయతీ రాజ్‌ శాఖలో గతంలో నిర్వహించిన బదిలీల ప్రకారం కొత్త స్థానాల్లోనే సిబ్బంది పనిచేయాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు. శాఖాపరంగా ఎవరికీ డెప్యుటేషన్‌ ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎవరి స్థానాల్లో వారు పనిచేయకుంటే మేం తీసుకునే కఠిన చర్యలకు వారు బా«ధ్యులవుతారు’
– బలివాడ సత్యనారాయణ, ఇన్‌చార్జి డీపీఓ

మరిన్ని వార్తలు