ఏసీబీ వలలో పంచాయతీరాజ్ జేఈ

4 Aug, 2013 04:25 IST|Sakshi
రోడ్లకు సంబంధించిన బిల్లు మంజూరు చేసేందుకు పంచాయతీరాజ్ జేఈ... కాంట్రాక్టర్ నుంచి రూ. 55 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న సంఘటన సింగరాయకొండలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో సునామీ పునర్నిర్మాణ ప్రత్యేక పనులను పంచాయతీరాజ్ జేఈ పీఎస్‌ఎన్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఐదు రోడ్ల పనులు హైదరాబాద్‌కు చెందిన అనిల్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌కు దక్కగా.. శ్రీధర్ అనే వ్యక్తి సబ్‌కాంట్రాక్ట్ తీసుకొని పనులు పూర్తిచేశాడు. మొత్తం రూ. 1.11 కోట్లతో నిర్మించిన పనుల్లో చివరి బిల్లుగా రూ. 10 లక్షలను మంజూరు చేయకుండా జేఈ నిలిపేశాడు. సదరు సబ్‌కాంట్రాక్టర్ ఎన్ని సార్లు తిరిగినా..రూ. 70 వేల లంచం ఇస్తేనే బిల్లు చేస్తానని తెగేసి చెప్పాడు. 
 
 దీంతో బేరసారాలు సాగించిన సబ్ కాంట్రాక్టర్ శ్రీధర్ చివరకు రూ. 55 వేలు ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. ఆ సొమ్మును శనివారం అందజేస్తానని చెప్పి శుక్రవారం నెల్లూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం సింగరాయకొండలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో జేఈకి రూ. 55 వేలను కాంట్రాక్టర్ అందజేశాడు. లంచం తీసుకున్న జేఈ కంప్యూటర్ వద్ద కూర్చొని అతని బిల్లులు తయారు చేస్తున్న సమయంలో చుట్టుముట్టిన ఏసీబీ అధికారులు నగదును, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జేఈ కుమార్‌ను కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీఎస్పీ జే భాస్కర్ తెలిపారు. ఈ దాడిలో ఆయనతో పాటు ఒంగోలు, నెల్లూరు ఏసీబీ సీఐలు టీవీ.శ్రీనివాసరావు, కే వెంకటేశ్వర్లు, సీహెచ్.చంద్రమౌళి, ఎం.కృపానందం సిబ్బంది పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు