వీరికి జోష్.. వారికి హుష్!

31 Jan, 2014 03:30 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై ఆశ పెట్టుకున్న నిరుద్యోగుల ఆశలపై ట్రిబ్యునల్ తీర్పుతో నీళ్లు చల్లినట్లైంది. రెండు విడతలుగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినా కేవలం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌పైనే అభ్యర్థులు ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఖాళీగా ఉన్న 169 గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్‌లో కలెక్టర్ (పంచాయతీ వింగ్) నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీని విద్యార్హతగా నిర్ణయించడంతో 17,292 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు మరో 161 మంది కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన అభ్యర్థులు కూడా వుండటం గమనార్హం.
 
 పదో తరగతి మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న కార్యదర్శులకు 75శాతం వెయిటేజీ ప్రకటించారు. వేలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో వెయిటేజీ వున్నా తమకు ఉద్యోగం దక్కదనే భావనతో కాంట్రాక్టు కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. డిగ్రీ విద్యార్హత  ఉన్న వారిని సర్వీసును క్రమబద్దీకరించాల్సిందిగా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. డిగ్రీ విద్యార్హత లేని కాంట్రాక్టు కార్యదర్శుల విషయంలో యదాతథంగా ఉద్యోగాల్లో కొనసాగిస్తూ తుది తీర్పు తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందిగా ట్రిబ్యునల్ సూచించింది. దీంతో 161 మంది కాంట్రాక్టు కార్యదర్శుల్లో డిగ్రీ విద్యార్హత కలిగిన 156 మందిని రెగ్యులర్ కార్యదర్శులుగా గుర్తించనున్నారు. మరో ఐదుగురి  సర్టిఫికేట్లను పరిశీలించిన తర్వాత భవిష్యత్తు నిర్ణయించనున్నారు.
 
 నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
 ట్రిబ్యునల్ తీర్పుతో కాంట్రాక్టు కార్యదర్శుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో వ్యయ, ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వచ్చి దరఖాస్తు చేస్తున్న నిరుద్యోగుల్లో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను మినహాయించి ఇతరుల నుంచి రూ.50 దరఖాస్తు ఫారంతో పాటు స్వీకరించారు. జిల్లా పంచాయతీ అధికారి ఖాతాకు ఇలా సుమారు రూ.5లక్షల మేర జమ అయినట్లు సమాచారం.
 
 ఇక సర్టిఫికేట్ల జిరాక్సులు, ఫోటోలు, బస్సు చార్జీలు తదితరాల రూపంలో ఒక్కో అభ్యర్థి సగటున రూ.500 నుంచి వేయి  వరకు ఖర్చు చేశారు. ఇదిలా  ఉంటే కలెక్టర్ కార్యాలయ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మరో నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 30న జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో 350 పోస్టులను భర్తీ చేస్తారు. నిరుద్యోగ అభ్యర్థులు ప్రస్తుతం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌పైనే గంపెడాశలు పెట్టుకుని ఫిబ్రవరి 23న జరిగే రాత పరీక్షకు సన్నద్ధమవుతున్నారు.
 
 ఉత్తర్వులు ఇచ్చాం: డీపీఓ రవీందర్
 ట్రిబ్యునల్ తీర్పు మేరకు అర్హులైన కాంట్రాక్టు కార్యదర్శుల పోస్టులను క్రమబద్దీకరిస్తూ నియామక పత్రాలు కూడా ఇచ్చాం. మరికొందరి సర్టిఫికేట్లపై పరిశీలన జరుగుతోంది. గతంలో కలెక్టర్ కార్యాలయ నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల భవిష్యత్తు ట్రిబ్యునల్ తుది తీర్పుకు లోబడి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు