వేధింపులు ఇక ఆపండి

21 Feb, 2018 12:01 IST|Sakshi
డీపీవో డాక్టర్‌ అరుణతో చర్చిస్తున్న ప్రసాద్‌

గళమెత్తిన పంచాయతీ కార్యదర్శులు

గుంటూరు వెస్ట్‌: ఎంత పనిచేసినా తమను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఏపీ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.డి.ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి దాదాపు 300 మంది పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ పన్నుల వసూళ్లు గంటల్లోనూ, రోజుల్లోనూ వసూలు చేయాలని లేకపోతే సస్పెండ్‌ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు.

హక్కులు మాత్రం అధికారులకు, బాధ్యతలు మాత్రం తమకు అనే పద్ధతిలో వ్యవస్థ నడుస్తుందని వాపోయారు. 6 నుంచి 18 ఏళ్లకు చెందిన ఇంక్రిమెంట్ల ఫైళ్లు అధికారులు తొక్కి పెడుతున్నారన్నారు. మెడికల్‌ బిల్స్‌ పెండింగ్‌ను క్లియర్‌ చేయడంలేదన్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శిని రెండు మూడు గ్రామాలకు ఇంచార్జ్‌లుగా నియమించడంవల్ల పనిభారం అధికమైపోతుందన్నారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్‌ జె.అ రుణతో సమస్యలపై చర్చించారు. ఆమె స్పందిస్తూ వీలైనంత వరకు మార్చి 15 నాటికి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏపీ పంచాయతీ కార్యదర్శులు సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ జాన్‌పీరా, ప్రధాన కార్యదర్శి జి.ఎస్‌.సి.బోస్, కోశాధికారి కె.సాంబ శివరావు ఎ.పి.గ్రామ పంచాయితీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మందపాటి వెంకటరెడ్డి, ప్రధాన కార్యద ర్శి పి.నాగరా జు, కోశాధికారి వెంకటాద్రి  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు