నేడు పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష

23 Feb, 2014 01:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఈనెల 23వతేదీన రాత పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 2,406 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 8.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు కూడా అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై పరీక్ష నిర్వహిస్తారు. జ వాబు పత్రాల మూల్యాంకనం తరువాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను మార్చి 24వ తేదీన జిల్లా కలెక్టర్లకు ఏపీపీఎస్సీ పంపుతుంది. పోస్టుల భర్తీ రెవెన్యూ జిల్లా యూనిట్‌గా జరుగుతుంది. 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీచేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ పాయింట్ల ద్వారా ప్రతిభాక్రమాన్ని అనుసరించి పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎంపిక కమిటీ గానీ చేపడుతుంది.

ఈ జాగ్రత్తలు పాటించాలి:
ఓఎంఆర్ జవాబు పత్రంలో బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే పరీక్ష రాయాలి. పెన్సిల్‌తో రాయకూడదు.  వైట్‌నర్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించడానికి వీల్లేదు. ఉపయోగిస్తే మూల్యాంకనం చేయరు.  పౌడర్, రబ్బరు, బ్లేడ్ వినియోగించినా మూల్యాంకనం చేయరు.

ఓఎంఆర్ ఒరిజినల్ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. డూప్లికేట్ జవాబు పత్రాన్ని మాత్రమే అభ్యర్థి తీసుకెళ్లాలి.

మరిన్ని వార్తలు