పంచాయతీ కార్యదర్శిల పోస్టులకు తీవ్రపోటీ

15 Feb, 2014 03:17 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: పంచాయతీ కార్యదర్శి పోస్టులకు తీవ్రపోటీ నెలకొంది. జిల్లాలో ఖాళీగా ఉన్న 133 పోస్టుల కోసం 59,270 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 445 మంది పోటీపడుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గత డిసెంబర్ 30న నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. గతనెల 4 నుంచి 26వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 23న ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్ష నిర్వహించనుంది. జిల్లాలో ఏడు పట్టణాల్లో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలుగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
 
 నల్లగొండ, భువనగిరి, సూ ర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లతోపాటు హుజూర్‌నగర్, కోదాడ పట్టణాల్లో 230 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ చేపట్టనున్నారు. జెడ్పీ సీఈఓ, డీఆర్‌ఓ, డీపీఓలను పరీక్ష కోఆర్డినేటర్లుగా కలెక్టర్ చిరంజీవులు నియమించారు. పరీక్ష నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోందని, అభ్యర్థులు ఎటువంటి పుకార్లు నమ్మకూడదని కలెక్టర్ సూచించారు. దళారులు ఉద్యోగాల ఎర వేసినా ఆకర్షితులై మోసపోకూడదని చెప్పారు. ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ జరుగుతుందని తెలిపారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్ష నిర్వహించిన మాదిరిగా మాస్‌కాపీయింగ్, ఇంపర్సినేషన్‌కు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  
 

మరిన్ని వార్తలు