ఆన్‌‘లైన్’...పడిగాపులు

21 Jan, 2014 02:13 IST|Sakshi
 విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్:నిరుద్యోగుల ఆశలకు సాంకేతిక లోపా లు అడ్డుకట్టవేస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శిపోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అసలే తక్కువ సమయం ఇచ్చారు. ఆ పై సోమవారమే ఆఖరి రోజు కావడంతో మీసేవా కేంద్రాల వద్ద వందల సంఖ్యలో క్యూ కట్టిన అభ్యర్థులు వైబ్‌సైట్ సర్వర్ డౌన్ కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏ రాత్రికైనా దరఖాస్తును ఆన్‌లైన్‌లో పెట్టవచ్చన్న ఆశతో రాత్రి వరకూ లైన్‌లోనే పడిగాపులు కాశారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మొదటి రోజు నుంచీ నానా  తంటాలు పడుతున్నారు. దరఖాస్తుదారులు ఫీజు  చెల్లించేందుకు సోమవారం ఆఖరు తేదీ కావడం...ఇదే రోజున ఉదయం నుంచి ఏపీపీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో చాలామంది నిరుద్యోగులు ఆందోళనకు గురయ్యా రు. అయితే 21వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువు పెంచినప్పటికీ అభ్యర్థుల్లో ఆందోళన తొలగలేదు.  
 
 రాష్ట్ర వ్యాప్తంగా 2,677   గ్రేడ్-4 పంచాయతీలకు కార్యదర్శులను నియమించేందుకు  ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా గత ఏడాది డిసెంబర్ 30న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో  జిల్లాకు సంబంధించి 201 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు .  జనవరి నాలుగు నుంచి 22 వరకు అభ్యర్థుల నుంచి   దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. అయితే ఈ నెల 20వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా ఎవరైతే దరఖాస్తు ఫీజు చెల్లిస్తారో... వారికి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చివరిరోజు 20వ తేదీ (సోమవారం)   పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత మీసేవా కేంద్రాలు  వద్ద బారులు తీరారు. అయితే ఉదయం నుంచి ఏపీపీఎస్సీ సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో వారికి పడిగాపులు తప్పలేదు. ఉదయానికే కేంద్రాల వద్దకు  చేరుకున్న వారికి సాయంత్రం ఆరు గంటల  వరకు ఆన్‌లైన్ నమోదు జరగలేదు. దీంతో మధ్యాహ్నం భోజనం చేయకుండా వేచి చూసిన అభ్యర్థులు ఒకింత అసహనానికి గురయ్యారు.   వందల సంఖ్యలో మీ సేవా కేంద్రాలకు వచ్చిన వారిలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. 
 
 అసలే తక్కువ రోజులు... ఆపై ఆన్‌లైన్ తంటాలు:
 నోటిఫికేషన్ జారీ నుంచి దరఖాస్తు చేసుకునేంత వరకు ఏపీపీఎస్సీ ఇచ్చిన గడువు తక్కువగా ఉండడం పట్ల నిరుద్యోగ యువత నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేవలం 17 రోజుల వ్యవధి ఉండగా అందులో పండగ మూడు రోజులు మినహాయిస్తే మిగిలింది 14 రోజులు మాత్రమే. అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. ఇందులో  మొదటి రోజు నాల్గవ తేదీ, చివరి రోజు 20వ తేదీల్లో సర్వర్ సక్రమంగా పని చేయకపోవడం నిరుద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పెంచాలన్న వారు డిమాండ్ చేశారు. 
 
మరిన్ని వార్తలు