పెద్దాయన బతికుంటే..

9 Nov, 2017 08:16 IST|Sakshi

 ఉద్యోగాలు రెగ్యులరయ్యేవని పంచాయతీ కార్మికుల ఆవేదన

 తప్పని ‘వెట్టి’ చాకిరీ.. ఎదుగూబొదుగూ లేని బతుకులు 

 వైఎస్సార్‌ను నిత్యం తలచుకుని బాధపడుతోన్న వైనం 

పెద్దాయన బతికుంటే మా బతుకులు ఇంకోలా ఉండేవని నిత్యం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తలచుకుని పంచాయతీలో కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 897 పంచాయతీల్లో సుమారు 1,200 మంది పార్టుటైం జేఏబీసీలు, పంపు ఆపరేటర్లు, కాంట్రాక్టు  ఆపరేటర్లు, స్వీపర్లు, ఎలక్ట్రీషియన్‌లు, ప్లంబర్లు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా చాలీచాలని జీతాలతో ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 

పాలకొల్లు అర్బన్‌: జిల్లాలోని పంచాయతీల్లో కాంట్రాక్టు, టెండర్, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో బిల్లు కలెక్టర్, కంప్యూటర్‌ ఆపరేటర్, గుమస్తా, ఎలక్ట్రీషియన్, ట్యాంక్‌ వాచర్, ప్లంబర్‌గా వందలాది మంది పార్టుటైమ్‌ ఉద్యోగులుగా చేరినా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్ణీత సమయం లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రీషియన్, ట్యాంక్‌ వాచర్లు అయితే అర్ధరాత్రి.. అపరాత్రి లేకుండా విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. ఆ సమయంలో వీరికి ఏమైనా అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పాలకొల్లు మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో సుమారు 60 మంది కాంట్రాక్టు కార్మికులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. 

రెన్యువల్‌కు ఏటా తప్పని తిప్పలు
ఆయా గ్రామ పంచాయతీల్లో కాంట్రాక్టు ఉద్యోగుల పోస్టులను కాంట్రాక్టు జిల్లా అధికారులు రెన్యువల్‌ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఏటా అధికారులకు లంచం ఇస్తేగాని రెన్యువల్‌ చేయడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఏడాది ఉద్యోగం కాంట్రాక్టు పొడిగించడానికి కనీసం రూ.1500 ఒక్కొక్కరి నుంచి డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏటా మార్చి నెలాఖరుతో కాంట్రాక్టు ముగుస్తుంది. తిరిగి ఏప్రిల్‌లో వీరి కాంట్రాక్టు ఉద్యోగం పొడిగించాలి. అయితే లంచం సొమ్ముల కోసం అధికారులు ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల వరకూ తీవ్ర జాప్యం చేసి.. అప్పుడు ఉద్యోగ కాల పరిమితిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. వీరిలో 30 ఏళ్ల నుంచి అరకొర జీతం పొందుతూ కాలం వెళ్లదీస్తున్న కార్మికులు ఎందరో ఉన్నారు. పంచాయతీ ఆదాయంలో 30 శాతం మించకుండా సిబ్బంది జీతాలు ఖర్చు చేసే వెసులు బాటు లేకపోవడంతో ఒక్కొక్క కార్మికుడు సీనియార్టిని బట్టి రూ.6 వేల నుంచి రూ.9 వేల జీతం పొందుతున్నారు. కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మరణించినవారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్‌ తదితర సౌకర్యాలు కల్పించాలని వీరంతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

వైఎస్సార్‌ జీవించి ఉంటే .. 
2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌ను రాష్ట్రంలోని పంచాయతీ  కాంట్రాక్టు కార్మికులంతా కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అర్హత, సీనియారిటీ ప్రకారం తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీనియారిటీ జాబితా రూపొందించాలని వైఎస్సార్‌ పంచాయతీ రాజ్‌ కమిషనర్‌కు ఆదేశాలిచ్చారని, ఆ వెంటనే రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఆ పెద్దాయన మృత్యువాత పడ్డారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మహానుభావుడే జీవించి ఉంటే మా ఉద్యోగాలు పర్మినెంట్‌ అయ్యేవని చెబుతున్నారు. 

ఏ టేబుల్‌ వద్ద ఎంతివ్వాలో తెలుసుకున్నా..
1983లో గోరింటాడ పంచాయతీలో రూ.3 జీతానికి చేరా. ఆ తరువాత సగం చెరువులో 1985లో రూ.6 జీతానికి కుదిరా. 32 ఏళ్ల సర్వీసు పూర్తి చేశా. ఏటా ఉద్యోగ కాల పరిమితి పొడిగించుకోవడానికి తిప్పలు పడుతున్నా. రూ.1500 ఖర్చు చేస్తే గాని ఏడాది కాలానికి ఉద్యోగ కాల పరిమితి పొడిగించరు. నా ఉద్యోగ సేవా కాలంలో ఏ టేబుల్‌ వద్ద ఎంతివ్వాలో తెలుసుకున్నా. 
బెజవాడ వెంకటేశ్వరరావు, పార్టుటైమ్‌ జేఏబీసీ

చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నా..
పదేళ్ల నుంచి పార్టుటైమ్‌ బిల్లు కలెక్టర్‌గా పనిచేస్తున్నా. పేరుకి పార్టుటైమ్‌ ఉద్యోగమే కానీ, పూర్తి సమయం దీనికే కేటాయిస్తున్నా. జీతం రూ.6 వేలు ఇస్తున్నారు. ఇరువురు సంతానం. కుటుంబ పోషణ భారంగా మారింది. వేరే ఏ పని చేసుకోలేక ఉద్యోగం రెగ్యులర్‌ అవుతుందనే ఆశతో పనిచేస్తున్నా. 
టి.రాజేంద్రప్రసాద్, పార్టుటైమ్‌ బిల్లు కలెక్టర్‌

19 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా..
ఐటీఐ చదివాను. 1998లో పైపులైన్‌ ఫిట్టర్‌గా విధుల్లో చేరా. 19 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా. రూ.650 జీతానికి చేరా. ప్రస్తుతం రూ.8 వేలు ఇస్తున్నారు. మూడు పంచాయతీలకు సంబంధించి రికార్డు వర్కు చేస్తున్నా. పనిభారమైంది. జీతం పెరగలేదు. ముగ్గురు ఆడపిల్లలతో ఆర్థిక ఇబ్బందులతో బతుకు బండి లాగుతున్నా. 
–శిల్పం దేవరాయులు, ఫైపులైన్‌ ఫిట్టర్‌

మరిన్ని వార్తలు