‘పంచాయతీ’ ఎన్నికలకు అంతా సర్వం సిద్ధం

4 Jul, 2013 06:39 IST|Sakshi

దుబ్బాక రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను సక్రమంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ దినర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన దుబ్బాక ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణ తేదీని ప్రకటించినందున వాటిని సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. కోడ్‌ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామన్నారు.

ఎన్నికల కోడ్‌కు సంబంధించి నియమ నిబంధనలు, బ్యాలెట్ బాక్సులు, పేపర్లు సిద్ధంగా ఉంచామన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాదిరిగానే ఎన్నికల నిబంధనలు ఉంటాయన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో అన్ని శాఖల అధికారులతో త్వరలోనే సమావేశాలు నిర్వహించి నిబంధనలపై కసరత్తు ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల కోసం జిల్లాలో ఇప్పటికే 10 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైతే ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల సాయం కూడా తీసుకుంటామన్నారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయిస్తామన్నారు.

పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తాం
పలు అభివృద్ధి పనులు, నిధుల కొరతతో మధ్యలోనే నిలిచి పోయిన పనులను సత్వరమే పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దినకర్ బాబు తెలిపారు.

బుధవారం దుబ్బాక ప్రభుత్వ అతిధి గృహంలో ఇంజినీరింగ్, ఎన్‌ఆర్‌జీఎస్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన 4 వేల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. అవి ఏ దశలో ఉన్నాయి, మధ్యలో నిలిచిపోయిన వాటిపై సమీక్ష చేపడతామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జిల్లాలో కొత్తగా పనులు చేపట్టే అవకాశం లేదన్నారు. కాకపోతే 389 జీఓ ప్రకారం పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కలెక్టర్‌కు వెసులుబాటు కల్పించిందన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయడం కోసం రూ. 160 కోట్లు నిధులు అవసరం ఉందన్నారు. వాటిని 2013-14-15 సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు