లోకేశ్‌ శాఖలో ప్రారంభం కాని పనులపై వేటు! 

2 Jun, 2019 04:41 IST|Sakshi

రూ.3,640 కోట్ల విలువైన పనులు రద్దు చేయండి  

ప్రభుత్వానికి పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ప్రతిపాదనలు   

ఎన్నికల ముందు హడావుడిగా అనుమతులు ఇచ్చేసిన టీడీపీ సర్కారు  

పనులు దక్కించుకున్న అధికార టీడీపీ నాయకులు  

ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని, పనులు ప్రారంభించని వైనం  

25 శాతం కూడా జరగని పనులూ రద్దు చేయాలని అధికారుల నిర్ణయం  

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ధ్యేయమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అవినీతి చోటుచేసుకున్న టెండర్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ మంత్రిగా పనిచేసిన పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ విభాగంలో అప్పట్లో అనుమతి తెలిపి, ఇప్పటికీ ప్రారంభం కాని రూ.3,640 కోట్ల విలువైన పనులను రద్దు చేయాలంటూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.  

10 శాతం అధిక ధరలకు పనుల అప్పగింత   
లోకేశ్‌ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ విభాగంలో అసెంబ్లీ ఎన్నికల ముందు పెండింగ్‌లో ఉన్న వాటితో కలిపి రూ.12,432 కోట్ల విలువైన పనులకు అనుమతులు మంజూరు చేసి, టెండర్లు పిలిచారు. ఇంజనీరింగ్‌ విభాగంలో చేపట్టే పనులకు అంచనా వ్యయం కంటే 20 నుంచి 5 శాతం తక్కువ ధరలకే టెండర్లు పూర్తయ్యే పరిస్థితి ఉండగా, శాసనసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకు టెండర్ల విధానంలో మార్పులు చేశారు. అంచనా వ్యయం కంటే 10 శాతం ఎక్కువ ధరలకు పనులు అప్పగించారు. టీడీపీ నేతలు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని, పనులు మాత్రం ప్రారంభించలేదు.  

సాధారణంగా పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ విభాగానికి బడ్జెట్‌లో ఏడాదికి రూ.800 కోట్ల కేటాయింపులు జరుగుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎంజీఎస్‌వై పథకం కింద వచ్చే నిధులతో పాటు నాబార్డు వంటి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ఈ శాఖలో కొన్ని పనులు చేపడుతుంటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో కాంట్రాక్టర్లు ఇప్పటివరకు చేసిన పనులకు గాను ప్రభుత్వం రూ.585 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కేంద్ర నిధులతో, బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులతో చేపట్టే పనులు కాకుండా.. వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే బిల్లులు చెల్లించడానికి అంగీకారం తెలిపిన మరో రూ.6,824 కోట్ల విలువైన పనుల్లో ఇప్పటికీ కొన్ని ప్రారంభం కాలేదు.

మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. 2019 ఏప్రిల్‌ 1 నాటికి ప్రారంభించని పనుల వివరాలను తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖలను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలకు మేలు చేసేందుకు గత ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేసిన, ఇప్పటికీ ప్రారంభం కాని పనులను రద్దు చేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల్లోనూ 25 శాతం లోపు కూడా పని జరగని వాటిని రద్దు చేయాలని నిర్ణయించారు. ఇలాంటివి దాదాపు రూ.2,000 కోట్ల విలువైన పనులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  

కేంద్ర నిధులతో చేపట్టే పనులపై త్వరలో నిర్ణయం 
60 శాతం కేంద్ర నిధులు, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పీఎంజీఎస్‌వై పథకం కింద ప్రస్తుతం ఏపీలో రూ.943 కోట్లు విలువైన పనులు జరుగుతున్నాయి. నాబార్డు రుణంతో రూ.442 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. వీటిలో చాలా పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టి, ఇప్పటికీ ప్రారంభం కాని పనులను కూడా రద్దు చేయాలా లేదా అనేదానిపై త్వరలో ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.  

ఖజానాకు సంబంధం లేని పనులు రద్దు చేయొచ్చా? 
ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తీసుకొని, రూ.3,635 కోట్లతో 2,442 చిన్నచిన్న రోడ్ల పనులకు పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం ఎన్నికల ముందు టెండర్లు పిలవగా పనులను టీడీపీ నేతలే దక్కించుకున్నారు. కోడ్‌ అమల్లోకి రావడంతో ఆ పనులేవీ ప్రారంభం కాలేదు. ఈ పనుల రద్దుకు ప్రతిపాదన చేయాలా వద్దా అనేదానిపై సీఎంతో జరిగే భేటీ తర్వాత నిర్ణయం తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు.   

మరిన్ని వార్తలు