నిర్వహణా.. నిర్మాణమా!?

10 Mar, 2015 03:33 IST|Sakshi

కొన్నేళ్ల నిధుల కరువు తీరింది. ఒక్కసారిగా నిధులు వచ్చి పడ్డాయి. వాటిని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే.. అంటే మార్చి 31లోగా ఖర్చు చేయాలి. లేనిపక్షంలో వెనక్కి వెళ్లిపోయే ప్రమాదముంది. అయితే వీటి వినియోగంలో కొంత వివాదం నెలకొంది. నిర్వహణ పనులకే ఈ నిధులు వెచ్చించాలని మార్గదర్శకాల్లో ఉండటంతో నిర్మాణాలు చేపట్టే విషయంలో గ్రామాల్లో వాగ్వాదాలు, వివాదాలు.. పరస్పర ఫిర్యాదులు వంటి ఘటనలతో ఉద్రిక్తతలు రేగుతున్నాయి.
 
 ఎచ్చెర్ల : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఎన్నికలు జరగడంతో ఆ నిధులన్నీ కొద్ది రోజుల వ్యవధిలోనే ఐదు విడతల్లో మంజూరయ్యాయి. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు మంజూరైన ఈ నిధులను సత్వరమే వినియోగించాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల.. అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 14వ ప్రణాళిక కాలం ప్రారంభం కానుంది. అందువల్ల ఇప్పుడు మంజూరైన నిధులన్నింటినీ ఈ నెలలోనే పంచాయతీల ఖాతాలకు జమ చేయాలి. వాటితో పనులు ప్రారంభం కావాలి. అయితే దీనికి నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఆర్థిక సంఘం నిధులతో పారిశుద్ధ్య నిర్వహణ పనులు మాత్రమే చేపట్టాలని నిబంధనల్లో ఉంది.
 
 సిమెంటు కట్టడాలు చేపట్టవచ్చని ఎక్కడా పేర్కొనలేదు. దాంతో ఒక్కసారి వచ్చిపడిన లక్షల నిధులను పారిశుద్ధ్య నిర్వహణకే ఎలా వినియోగిస్తారన్నది చర్చనీయాంశంగా మా రింది. మురుగు కాలువలు, సిమెంట్ కల్వర్టులు, సీసీ రోడ్ల నిర్మాణం కూడా పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగమేనని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అంటుండగా.. అధికారులు కూడా అదే చెబుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు మాత్రం నిర్మాణాలు నిర్వహణ కిందకు ఎలా వస్తాయని ప్రశ్నిస్తూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫలితంగా వివాదాలు రేగుతున్నాయి.
 
 ఫరీదుపేటే ఉదాహరణ
 ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో ఏర్పడిన వివాదమే ఈ పరిస్థితికి నిదర్శనం. ఈ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా పేర్కొంటూ సిమెంట్ కాలువలు నిర్మిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు నిర్వహణకే తప్ప నిర్మాణాలకు అవకాశం లేదని వాదిస్తూ.. దీనిపై అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ అంశం రెండు వర్గాల మధ్య వివాదంగా మారినప్పటికీ అధికారులు మాత్రం ‘పాము చావదు.. కర్ర విరగదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కాలువల నిర్మాణం పారిశుద్ధ్య నిర్వహణలో భాగమేనని ఒకపక్క చెబుతూ.. మరోపక్క జిల్లా అధికారులను అడిగి నిర్ణయం తీసుకుంటామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జనాభా ప్రాతిపదికన ఈ పంచాయతీకి రూ.9.12 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో రూ. 2 లక్షలు విద్యుత్ సామగ్రికి, రూ.62 వేలు కల్వర్టు నిర్మాణానికి ఖర్చు చేశారు. రూ. 6.02 లక్షలతో ప్రస్తుతం మురుగు కాలువలు నిర్మిస్తున్నారు. నాలుగు నివాస కమిటీలకు అప్పగించిన ఈ పనులు ప్రస్తుతం వివాదంలో పడ్డాయి.
 
 నిబంధనలు ఇలా..
 జిల్లాలోని పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 16,09,17,600 మంజూరయ్యాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి జీవో విడుదలైంది. 2011 జనాభా ప్రాతిపదికన ఈ నిధులు మంజూరు చేశారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలు పరిశీలిస్తే.. సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ స్కీములు, పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, వృథా నీరు, పంచాయతీ కార్యాలయం, ఈ-పంచాయతీ, పాఠశాలలు, అంగ న్‌వాడీ కేంద్రాల నిర్వహణకు నిధులు వినియోగించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యానికి కీలకమైన మురుగు కాల్వలు, అంతర్గత రోడ్ల నిర్మాణం గురించి ప్రస్తావించలేదు. అయినా ప్రస్తుతం పెద్ద మొత్తంలో మంజూరైన నిధులతో జిల్లాలో 80 శాతం సిమెంటు కాలువల నిర్మాణాలే చేపడుతున్నారు. దీనిపై పలు గ్రామాల్లో వివాదాలు రేగి ఫిర్యాదుల వరకు వెళుతుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముంది.

మరిన్ని వార్తలు