పంచాయతీలకు షాక్ !

12 Nov, 2014 01:20 IST|Sakshi
పంచాయతీలకు షాక్ !

చిలకలూరిపేటరూరల్: గ్రామాల పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 13వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఈనెల మూడవ తేదీన ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రామస్తులు, సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 1011 గ్రామ పంచాయతీలకు 112 మేజర్, 899 మైనర్‌గా ఉన్నాయి. అన్ని పంచాయతీలకు ప్రతి ఏటా రెండు విడతలుగా జనాభా ప్రాతిపాదికన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాల్సి వుంది.

 13వ ఆర్థిక సంఘం నిధులు ఇలా...
  గ్రామ పంచాయతీలకు విడుదల చేసే 13వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, అంతర్గత రోడ్లు, వీధి లైట్ల ఏర్పాటు, పంచాయతీ భవనం, మంచినీటి పథకాల నిర్వాహణ నిర్వహించాల్సి ఉంటుంది.

     జనాభా ప్రాతిపాదికన ఒక్కరికి రూ. 400 వంతున జిల్లాలోని 32,02,477 లక్షల మందికి నిధులను విడుదల చేస్తోంది. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 128 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది.
  పంచాయతీ పాలకవర్గాలు ఏర్పాటై ఏడాది గడిచింది. ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం, స్టేట్‌ఫైనాన్స్ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతోంది. ఈ నిధుల్లో కోతలు విధించినా, దారి మళ్లించినా  అభివృద్ధి ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న.

  నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంపై పంచాయతీ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి పంచాయతీ నిధుల నుంచి 15 శాతం మాత్రమే విద్యుత్ అవసరాలకు వినియోగించాలి. అలా కాకుండా ఆర్థిక సంఘం నిధులను వినియోగించాలని ఆదేశించడంపై అధికారులు తటపటా ఇస్తున్నారు.

  జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వీధిలైట్లు, మంచినీటి సరఫరా అవసరాలకు విద్యుత్ వినియోగంతో అక్టోబర్ చివరి వరకు రూ. 55.85 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. బకాయిలు వెంటనే చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, అయితే ప్రజల అవసరాల మేరకు ఇప్పటి వరకు కొనసాగించామని పేర్కొంటున్నారు.

 ప్రతిపాదనలు పంపించాం..
     13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. తొలి విడతగా రూ. 25 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. గత నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలను చెల్లించాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పై నుంచి ఆదేశాలు జారీ చేశారు.
 - గ్లోరియా, ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారి, గుంటూరు
 
 ఇదీ బాబు భాష్యం...
 గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను త్వరలో కేంద్రప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులతో చెల్లించాలి. మిగిలిన వాటితో ప్రతి పంచాయతీలో ఒక్కో సీసీ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ నిధులు పూర్తిస్థాయిలో సమకూరని పక్షంలో కేంద్ర ప్రభుత్వ ఉపాధిహామీ పథకంతో నిర్వహించాలి.
  - ఇటీవల గ్రామ పంచాయతీ అధికారులతో రాష్ట్ర సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పిన మాటలివి..
 
 వాస్తవంగా ఇలా చెల్లించాలి..
 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు విద్యుత్ బకాయిలను పంచాయతీ అధికారులు పన్నులు వసూలు చేసి చెల్లించేవారు. ఇంటి పన్నుల వసూలులోనే వీధి దీపాల పన్ను ఉంటుంది. ఇంటి పన్నుల సమయంలోనే మంచినీటి కుళాయిల పన్నుల చెల్లింపులు ఉంటాయి.

మంచినీటి సరఫరా అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామీణ మంచినీటి సరఫరా పథకం (ఆర్‌డబ్లుఎస్) అధికారులే నిధులు మంజూరు చేస్తారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వసూలు చేసిన  నీటి కుళాయిల పన్నులను విద్యుత్ బకాయిలకు చెల్లించేవారు. బకాయిలు అధికంగా ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల నుంచి సర్దుబాటు చేస్తారు.
 
 ఉన్న నిధులన్నీ విద్యుత్ బకాయిలకేనా ?

 మైనర్ పంచాయతీగా ఉన్న మద్దిరాల గ్రామానికి 13వ ఆర్థిక సంఘం ద్వారా కేవలం లక్ష రూపాయలు మాత్రమే మంజూరవుతాయి. అందులో నుంచి విద్యుత్ బకాయిలు రూ. 52,912 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన కొద్దిపాటి నిధులతో గ్రామంలో అభివృద్ధి సాధ్యమవుతుందా. ప్రత్యేక నిధులు కేటాయించకుండా ఉన్న నిధులను వీటితో వినియోగించటం భావ్యమేనా.
 - మాలెంపాటి త్రిపురాంబ, సర్పంచ్, మద్దిరాల
 
 బకాయిలు ప్రభుత్వం చెల్లించాలి
 పేరుకు మేజర్ పంచాయతీ అయి నా అభివృద్ధి కార్యక్రమాలకు అదే తరహాలో నిధులు విడుదల కావాల్సి ఉంది. ఎన్నికై సంవత్సరం పూర్తయినా అరకొర నిధులే వస్తున్నాయి. 13వ ఆర్థిక సంఘం నుంచి జనాభా ప్రాతిపాదికన రూ 6.50 లక్షలు విడుదలవుతాయి. ఇప్పటి వరకు విద్యుత్ బకాయిలు రూ 7.68 లక్షలు ఉన్నాయి. ఆ నిధులతో బకాయిలు చెల్లిస్తే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేదెలా.బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తే పంచాయతీల్లో అభివృద్ధి సాధ్యమే.
 -  కొమ్మనబోయిన దేవయ్య, సర్పంచ్, మురికిపూడి

మరిన్ని వార్తలు