కాగితం వంతెనలు

30 Jul, 2014 01:45 IST|Sakshi
కాగితం వంతెనలు

ఏలూరు : జిల్లాలోని 15 ప్రధాన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ)ల నిర్మాణానికి దశాబ్దాల తరబడి ప్రతిపాదనలు చేస్తున్నా బుట్టదాఖలవుతున్నాయి. కాగితాలకే పరిమి తం అవుతున్న వీటిని ఈ ప్రాంత ప్రజలు ముద్దుగా కాగితం వంతెనలు అని పిలిచుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు జిల్లా నుంచి భారీగా ఆదాయం సమకూరుతున్నా ఈ ప్రాం తంపై ఆ శాఖ అధికారులు శీతకన్ను వేస్తున్నారు. ప్రధాన రహదారులపై ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఆర్‌వోబీలను నిర్మించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 15చోట్ల వీటి నిర్మాణాలకు ఐదు దశాబ్దాలుగా ఆర్ అండ్ బీ శాఖ నుంచి తరచూ ప్రతిపాదనలు వెళుతున్నా ఒక్కదానికి కూడా నేటికీ గ్రీన్‌సిగ్నల్ రాలేదు. కనీసం ఏడాదికి ఒక్క ఆర్‌వోబీ నిర్మాణానికి నిధులిచ్చినా ఏనాడో వీటి నిర్మాణాలు పూర్తయ్యేవి.
 
 ఇవీ ప్రతిపాదనలు
 ఏలూరు మార్కెట్ యార్డు, భీమడోలు లెవెల్ క్రాసింగ్-368, చేబ్రోలు లెవెల్ క్రాసింగ్-365, బాదంపూడి-ఉంగుటూరు, ప్రత్తిపాడు-ఆరుగొలను, నవాబ్‌పాలెం, ఆకివీడు-ఉండి, ఉండి-భీమవరం, భీమవరం-మంచిలి, శృంగవృక్షం-పాలకొల్లు, నరసాపురం లెవెల్ క్రాసింగ్, భీమవరం (బైపాస్ రోడ్డు), ఏలూరు పవర్‌పేట, నిడదవోలు, కైకరం రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్‌వోబీల నిర్మాణానికి ఎన్నోసార్లు ప్రతిపాదనలు వెళాలయి. వీటిలో కేవలం నిడదవోలు, ఏలూరు పవర్‌పేట లెవెల్ క్రాసింగ్‌ల వద్ద లైన్ అలైన్‌మెంట్‌ను పరి శీలించారు. కాగా అంచనా వ్యయం తడిసిమోపెడు కావడంతో నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు. ఒక్కొక్క వంతెన నిర్మాణానికి సగటున రూ.40 కోట్ల అవుతుందని గతంలో అంచనా వేస్తే ఆ మొత్తం రూ.600 కోట్లకు దాటిపోయింది. మూడేళ్ల క్రితం వట్లూరులో ఆర్‌వోబీ మంజూరు కాగా, అధికారులు ఇటీవల పనులను ప్రారంభింపచేశారు.
 
 నిత్యం ప్రమాదాలే
 రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలం అవుతోంది. ఆర్‌వోబీల నిర్మాణానికి ప్రతిపాదించిన 15 రైల్వే క్రాసింగ్‌లు ప్రధాన రహదారులపైనే ఉన్నాయి. అక్కడ ఐదేసి నిమిషాలకు ఒకసారి రైల్వే గేట్లు వేయడం వల్ల కిలోమీటర్ల కొద్దీ ట్రా ఫిక్ నిలచిపోతోంది. వివిధ పనులపై వెళ్లేవారు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు సమయాభావం వల్ల గేటు వేసినా కిందనుంచి రాకపోకలు సాగిస్తూ మృత్యువాత పడుతున్నారు. తరచూ ఏదో ఒకచోట రైలు దాటుతూ విగతజీవులు అవుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను నిర్మూలించి ప్రయాణాలు సాఫీగా సాగాలంటే ఆర్‌వోబీల నిర్మాణమే శరణ్యమ ని అధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అరుునా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.  
 
 ప్రజాప్రతినిధులూ.. పట్టించుకోరే
 ఆర్‌వోబీల నిర్మాణానికి రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం (ఆర్ అండ్ బీ) నిర్ధేశించిన మేరకు సకాలంలో  వాటా నిధులను విడుదల చేస్తేనే వాటికి  మోక్షం కలుగుతుంది. రైల్వేశాఖ కేవలం రైల్వేగేటు వరకు మాత్రమే నిర్మాణాలకు నిధులిస్తోంది. వంతెన పూర్తిచేయడంతోపాటు అటూఇటూ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అధిక శాతం నిధులను ఆర్ అండ్ బీ శాఖ వెచ్చించాల్సి ఉంటుంది. వీటిని మంజూరు చేయించే విషయంలో పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు శ్రద్ధ చూపడం లేదు.
 

మరిన్ని వార్తలు