పార్థుడు.. గిమ్మిక్కులు

17 Sep, 2019 08:18 IST|Sakshi
ఆర్డీఓ కార్యాలయం వద్ద పింఛన్ల విషయమై ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీకే

టీడీపీ కార్యకర్త మొదలు నాయకుడి దాకా పింఛన్లు

నేటికీ లబ్ధిపొందుతున్న వైనం

ప్రభుత్వంపై బురద జల్లేందుకు ధర్నాతో మాజీ ఎమ్మెల్యే డ్రామా

పెనుకొండ: గత తెలుగుదేశం పార్టీ హయాంలో పింఛన్‌ వ్యవహారంలో పెద్దస్థాయిలో అక్రమాలకు తెరలేపారు. అనర్హులకు పెద్ద పీట వేస్తూ అర్హులకు న్యాయం చేశారు. దీంతో వేలాదిమంది వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, డప్పుకళాకారులకు పింఛన్‌ రాక అవస్థలు పడుతూనే ఉన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్ధసారధి ఎవరికి చెబితే వారికి పింఛన్‌లను పంచి పెట్టారు. నేటికీ వారంతా దర్జాగా పింఛన్లను పొందుతుండటం విశేషం. 

ఒకే ఇంట్లో 5 మందికి ఫింఛన్లు..
రొద్దం మండలం నారనాగేపల్లి పంచాయితీకి చెందిన ఓ మాజీ సర్పంచ్‌తో పాటు ఆయన భార్యకు, వున్న తమ్ముళ్ళందరికీ చేనేత ఇతర  ఫింఛన్‌లు వస్తున్నాయి. ఇది గ్రామస్తులందరికీ బాహాటంగా తెలిసినా కిమ్మనలేని పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే అనుచరవర్గం కావడంతో ఏమనలేని పరిస్థితి. ఇక ... కుర్లపల్లిలో భర్తలు ఉండి కూడా ఒంటరి మహిళల పింఛన్లను పలువురు పొందుతున్నారు. టీడీపీ నాయకుల హవాతో ఇష్టారాజ్యంగా పింఛన్‌లు మంజూరు చేశారనడానికి  ఇదొక పెద్ద ఉదాహరణ. 

ప్రభుత్వంపై కుట్రలు..
పింఛన్ల విషయంలో వందలాది మంది అనర్హులకు ఫింఛన్‌లు ఇచ్చిన టీడీపీ నాయకులు అధికారులు విచారణ చేస్తే ఈ అక్రమాలు ఎక్కడ బట్టబయలు అవుతాయనే ఉద్ధేశ్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కుట్రలకు శ్రీకారం చుట్టారు. అయితే అధికారులు సక్రమంగా విచారణ చేపడితే జరిగిన అక్రమాలు బహిర్గతమవుతాయి.    

పింఛన్ల వివరాలు ఇలా..
టీడీపీ హయాంలో వస్తున్న పింఛన్‌లను పరిగణలోకి తీసుకుంటే నియోజకవర్గ వ్యాప్తంగా 36,425 పింఛన్‌లు వస్తుండగా, అందులో చేనేత పింఛన్‌లు 1913 , ఒంటరి మహిళలు 1070, డప్పుకళాకారుల పింఛన్‌లు 305 ఉన్నాయి. అయితే వీటిలో పెద్దఎత్తున అనర్హులు ఉన్నారని అధికారులు అనుమానిస్తూ చాలా వాటిని పెండింగ్‌లో ఉంచారు. పూర్తీ స్థాయిలో దర్యాప్తు జరిగితే అనర్హుల చిట్టా ఇట్టే బయటపడనుంది. అయితే ఇప్పటి వరకు అధికారులు పూర్తీస్థాయిలో విచారణకు ఉపక్రమించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

ధర్నాతో మాజీ ఎమ్మెల్యే రాద్దాంతం
నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులకు చెందిన పింఛన్లను అధికారులు పెండింగ్‌లో పెట్టడంతో మాజీ ఎమ్మెల్యే బీకే.పార్థసారథి సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనికి కారణం పింఛన్ల జాబితాలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉండటమే కారణమని పలువురు విమర్శిస్తున్నారు. ధర్నాలో పింఛన్‌దారులు నామమాత్రంగా కూడా హాజరుకాకపోగా టీడీపీ నాయకులు మాత్రం అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీనిపై సైతం పెద్ద ఎత్తున చర్చసాగింది. 

మరిన్ని వార్తలు