ఇదేం ‘ఆదర్శం’

16 Nov, 2014 01:26 IST|Sakshi
ఇదేం ‘ఆదర్శం’

కశింకోట: మండలంలోని తేగాడ ఆదర్శ పాఠశాల నిర్వహణ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, సిబ్బంది పనితీరుపై ఫిర్యాదుల మేరకు శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వి. కృష్ణారెడ్డి సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కొరవడిందని, దీనివల్ల చదువులు సరిగ్గా సాగక విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిందని  తల్లిదండ్రులు వాపోయారు.

కార్పోరేట్ కళాశాలల్లో చదివించే స్థోమత లేక, ఉన్నతమైన ఐఐటి పరీక్షలకు తయారు చేస్తారని ఆశించి తమ పిల్లలను ఇక్కడ చేర్పించామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు  ప్రధాన పాఠ్యాంశాలైన రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం బోధించడానికి చాలా కాలంగా ఉపాధ్యాయులే కొరవడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల వసతి గృహాన్ని నిర్మించి ప్రారంభించినప్పటికీ దాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడం పట్ల దూరప్రాంత బాలికలు రోజూ పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. యూనిఫాం ఇవ్వలేదని, ఆర్టీసీ బస్సును బయ్యవరం హెరిటేజ్ డెయిరీ వరకే పరిమితం చేయకుండా తాళ్లపాలెం వరకు నడపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల రోడ్డును మెరుగు పర్చాలన్నారు.

వ్యక్తిగత కక్షతో తమ అమ్మాయిని ప్రిన్సిపాల్ అవమానిస్తున్నారని, ఇది శోచనీయమని  పి.కల్యాణి  ఈ సందర్భంగా డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ పెంటకోట సుబ్బలక్ష్మి మాట్లాడుతూ విద్యా సంస్థలో రాజకీయాలకు, వ్యక్తిగత ప్రతిష్టలకు తావు లేకుండా నడపాలన్నారు. సర్పంచ్ సిదిరెడ్డి సూర్యనారాయణ,విద్యార్థుల తల్లిదండ్రులు జి.నానాజీ,మజ్జి వెంకట రామకృష్ణ పరమహంస తదితరులు తమ అభిప్రాయాలను, పాఠశాలలో ఎదురయ్యే సమస్యలను డీఈవో దృష్టికి తెచ్చారు.
 
త్వరలో ఉపాధ్యాయుల కొరత నివారణ:
ఈ సందర్భంగా డీఈవో కృష్ణారావు మాట్లాడుతూ 15 రోజుల్లోగా కొత్త ఉపాధ్యాయులు రానున్నారన్నారు. బాలికల వసతి గృహం తెరవడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం లేఖ రాశామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సును నడపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.    ప్రిన్సిపాల్ సంధ్యకు అనుకూలంగా, వ్యతిరేకంగా తల్లిదండ్రులు విడిపోయి కొంతసేపు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌తో డీఈవో సమావేశమయ్యారు. అంతా సమన్వయంతో పని చేసి పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ను కృషి చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు