అందరినోటా ఆంగ్లం మాట...

30 Apr, 2020 13:00 IST|Sakshi

ఆంగ్ల మాధ్యమంపైనే ఎక్కువ మంది మొగ్గు

గతంలో పేరెంట్‌ కమిటీలు... ఇప్పుడు తల్లిదండ్రులు

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్న తల్లిదండ్రులు, మేధావులు

విజయనగరం అర్బన్‌: ప్రాధమిక స్థాయి నుంచే ఆంగ్లమాధ్యమం అమలు చేయాలంటూ ఎక్కువ సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు కోరారు. పోటీ ప్రపంచంలో అధునాతన విజ్ఞానం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఆంగ్లమాధ్యమ చదువులు తప్పనిసరిగా వారు భావిస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందివ్వాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన నిర్ణయాన్నే అంతా స్వాగతిస్తున్నారు. తెలుగు సబ్జెక్టుతో పాటు ఇంగ్లిష్‌ మీడియం అమలు చేసే అంశంపై గతంలో యాజమాన్య కమిటీలతో అభిప్రాయ సేకరణ చేసిన ప్రభుత్వం... తాజాగా పిల్లల తల్లిదండ్రులనుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టింది.

నాడు పేరెంట్‌ కమిటీలు... నేడు తల్లిదండ్రులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుపై జనవరిలో నిర్వహించిన పేరంట్‌ కమిటీల సమావేశాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. అప్పట్లో 97 శాతం ఆంగ్లమాధ్యమాన్నే కోరారు. ప్రస్తుతం తల్లిదండ్రుల అభీష్టం తెలుసుకునేందుకు ప్రభుత్వం మూడు రోజుల నుంచి సర్వే చేపట్టింది. ఈ సారి కూడా అదేరీతిలో కోరినట్టు తెలియవచ్చింది.

బడుగు ప్రజలకు వరం
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం పెట్టడం బడుగు బలహీన వర్గాల ప్రజలకు వరం. ఉన్నత విద్యతోపాటు ఉద్యోగాలకు పోటీ పడాలంటే తప్పని సరిగా ఇంగ్లిష్‌ మీడియం అవసరం. అందుకే మేము మా ఇద్దరి పిల్లలను ఓ ప్రైవేటు స్కూల్లో ఇంగ్లిష్‌ మీడియంలో గతేడాది వరకు చదివించాను. ఫీజులు భారమైనప్పటికీ భరిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెట్టడం మాలాంటివారికి వరం.– బొడబళ్ల సత్యవతి, విద్యార్థి తల్లి, ఎంపీపీ స్కూల్, కొర్లాం, గంట్యాడ మండలం.

ఇంగ్లిష్‌ మాధ్యమం ఉండాలి
పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్‌ భాష ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రతి ఒక్కరికీ ప్రాథమిక విద్య నుంచి ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధన అనివార్యమైంది. నేడు పేద, మధ్యతరగతి వారికి ఇంగ్లిష్‌ బోధన కోరుకొనే వారు అధికంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం చేపడుతున్న ఆలోచన మంచిదే.         – జె.సి.రాజు, జిల్లా కన్వీనర్,విద్యాపరిరక్షణ కమిటీ

మరిన్ని వార్తలు