తనయుడి అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు

17 Dec, 2013 03:41 IST|Sakshi


 బూర్గంపాడు, న్యూస్‌లైన్: చేతికందవచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడిన చివరి క్షణాల్లో ఉండగా ఆ తల్లిదండ్రులు మానవత్వంతో అతని అవయవాలు దానం చేసిన సంఘటన ఇది. బిడ్డ ఎలాగు బతకడని డాక్టర్లు చెప్పడంతో మానవత్వంతో అవయవాలు దానం చేసి కొంతమందికి ప్రాణదానం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బసప్ప క్యాంపునకు చెందిన దడ్డి వినోద్‌కుమార్ మూడు రోజుల క్రితం క్వాలిస్ వాహనంలో శివస్వాములను తీసుకుని శ్రీశైలం వెళ్తుండగా కృష్ణాజిల్లా మైలవరం వద్ద టైరు పగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని విజయవాడ తీసుకెళ్లి వైద్యం చేయించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడి లక్డీకాపూల్ గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు.
 
 ఆదివారం సాయంత్రం అతని మెదడు పని చేయడం మానేసింది. దీంతో వైద్యులు అతను దాదాపుగా మరణించినట్లేనని తల్లిదండ్రులకు తెలిపారు. అప్పటికి అతని గుండె, కిడ్నీలు, కాలేయం, కళ్లు పని చేస్తున్నాయని, తక్షణం వాటిని దానం చేయవచ్చని వైద్యులు చెప్పడంతో వినోద్‌కుమార్ తల్లిదండ్రులు జనార్ధర్, పద్మావతి, సోదరులు విజయ్‌కుమార్, రవికుమార్, రాజ్‌కుమార్‌లు ఆలోచించుకుని ఒప్పుకున్నారు. దీంతో ఆస్పత్రి వైద్యులు వెంటనే అతని అవయవాలను(గుండె, కాలేయం, కళ్లు, కిడ్నీలు) సేకరించారు. గుండెను నిమిషాల వ్యవధిలోనే వేరొకరికి అమర్చారు. ఇది జిల్లాలోనే తొలి అవయవదానం కేసుగా చర్చించుకుంటున్నారు. వినోద్‌కుమార్ తల్లిదండ్రుల నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు. సోమవారం సారపాకలో వినోద్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

>
మరిన్ని వార్తలు