తల్లిదండ్రుల నుంచే ప్రాణహాని

21 May, 2016 02:34 IST|Sakshi
తల్లిదండ్రుల నుంచే ప్రాణహాని

రక్షణ కోరుతూ ‘సాక్షి’కి మొరపెట్టుకున్న యువతి
కొత్తపేట మహిళమండలిలో ఆశ్రయం పొందుతున్న
బాధితురాలు మాధవి

 
సాక్షి, గుంటూరు  : తన తల్లిదండ్రుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామానికి  చెందిన  కొలసాని మాధవి శుక్రవారం ‘సాక్షి’కి మొరపెట్టుకుంది. కొత్తపేట మహిళా మండలిలో ఆశ్రయం పొందుతున్న మాధవి కథనం ప్రకారం మైనర్‌గా ఉన్నపుడు 17 ఏళ్ల వయసులో మాధవికి ఇష్టం లేకుండా మేనమామ కొడుకుతో పెళ్లి చేశారు. పెళ్లి ఇష్టం లేక, ఇంటి నుంచి వెళ్లిపోయి చదువుకునేందుకు గుంటూరు వచ్చింది. ఈ విషయంలో తనకు సహకరించిన యువకుడి అమ్మా, నాన్న, అక్కా, బావలపై తన తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనార్టీ తీరడంతో మాధవి విడాకులు కోరుతూ కోర్టు ద్వారా నోటీసులు పంపింది. తన తల్లిదండ్రులకు తుళ్ళూరు, దొండపాడు గ్రామాల్లో  20 ఎకరాల పొలం ఉందని, దానికి తాను అడ్డుగా ఉన్నాననే చంపాలని చూస్తున్నారని మాధవి ఆరోపించింది. ఈ విషయమై ఈనెల 10వ తేదీన గుంటూరు వచ్చిన హోం మంత్రి చినరాజప్పను కలిసి ఫిర్యాదు చేయడంతో, ఆయన రూరల్ ఎస్పీ వద్దకు పంపారని, ఆయన తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలంటూ ఒత్తిడి చేశారని మాధవి వాపోయింది.  తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మాధవి వేడుకుంటోంది.

మరిన్ని వార్తలు