బాల్యం.. బందీ

22 Jun, 2018 08:40 IST|Sakshi
చిత్తూరులోని మిట్టూరు వద్ద భిక్షాటన చేస్తున్న చిన్నారి

నిర్వీర్యమవుతున్న ప్రభుత్వ లక్ష్యం

తగ్గని బాల కార్మికుల సంఖ్య

జిల్లాలో 4,167 మంది డ్రాపౌట్ల గుర్తింపు

బాల్యం మరుపురాని జ్ఞాపకం.. జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే కమ్మనికావ్యం. కాని పరిస్థితుల ప్రభావం..తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో ఏటా వేల మంది చిన్నారులు బాలకార్మికులుగా మారిపోతున్నారు. చిన్న వయసులోనే వెట్టిచాకిరికీ గురవుతున్నారు. ప్రభుత్వాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఇవ్వడం లేదు.

చిత్తూరుఎడ్యుకేషన్‌: జిల్లాలో ఏటా బాలకార్మికుల సంఖ్య పెరగడమేగాని తగ్గడం లేదు.  బాలకార్మికుల నిర్మూలన కోసం సర్వశిక్షా అభియాన్, కార్మికశాఖ చర్యలు తీసుకుంటున్నా ఇంకా 4,167 మంది ఉన్నారు. విద్యాహక్కు చట్టం(2009) అమల్లోకి వచ్చి పదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ సంచారంలో, ఇటుక బట్టీలు, హోటళ్లు, డాబాలు, దుకాణాలు, వెట్టి చాకిరీలో, భిక్షాటన చేస్తూ చిన్నారులు మగ్గుతూనే ఉన్నారు.

అధికారులు విఫలం
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో అధికారులు విఫలమవుతున్నారు. సర్వశిక్షాఅభియాన్, బాలకార్మికుల శాఖ, సమగ్రశిశుసంక్షేమ శాఖ అధికారులు బడిబయట పిల్లలపై శ్రద్ధ చూపకపోవడంతో ఫలితాలు నెరవేరడం లేదు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో ముఖ్యపాత్ర పోషించాల్సిన సర్వశిక్షా అభియాన్, కార్మికశాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.  

జిల్లాలో 4,167 మంది డ్రాపౌట్లు!
జిల్లాలో తిరుపతి రూరల్, అర్బన్, ఏర్పేడు, మదనపల్లె, రామసముద్రం, చిత్తూరులో 4,167 మంది బాలకార్మికులు ఉన్నట్లు సర్వశిక్షాఅభియాన్‌ అధికారులు గుర్తించారు. వారిని బడిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిలో ఇప్పటివరకు 2,818 మందిని పాఠశాలలో చేర్పించామని సర్వశిక్షా అభియాన్‌ అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారే గాని క్షేత్రస్థాయిలో అంతమంది పాఠశాలలో చేరలేదనే విమర్శలున్నాయి.

ప్రత్యేక నిబంధనలివీ..
ఆర్టికల్‌ 15: మహిళలు, బాలల సంక్షేమాన్ని ప్రత్యేక చట్టాలు చేయవచ్చు.
ఆర్టికల్‌ 23 (1): బాలలను అమ్మడం, కొనడం, భిక్షాటన చేయించడం, నిర్భంద చాకిరీ నిషేధం.
ప్రకరణం 30(సి): పిల్లలు తమ వయçసు, శక్తికి మించిన పనుల్లో నిమగ్నం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ప్రకరణం 39 (ఎఫ్‌) : బాలలు స్వేచ్ఛాయుత గౌరవప్రద పరిస్థితుల్లో ఆరోగ్యవంతంగా పెరగడానికి తగినన్ని అవకాశాలు, సౌకర్యాలను కల్పించాలి. బాల్యాన్ని కామపీడన నుంచి, నైతిక, భౌతిక నిర్లక్ష్యాల నుంచి ప్రభుత్వం రక్షించాలి.
ప్రకరణం 47 : బాలలకు పౌష్టికాహారం, మెరుగైన జీవనాన్ని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

నీరుగారుతున్న లక్ష్యం
జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టు లక్ష్యం జిల్లాలో నీరుగారుతోంది. ఆ ప్రాజెక్టులో భాగంగా 9 నుంచి 14 ఏళ్ల లోపు బాల కార్మికుల కోసం ప్రత్యేక స్కూళ్ల ఏర్పాటు, ఉపకార వేతనాలు అందించేందుకు కేంద్రం పుష్కలంగా నిధులు అందిస్తోంది. అయితే సర్వశిక్షా అభియాన్, కార్మికు ల శాఖల సహకారం లోపించడంతో స్కూళ్ల నిర్వహణకు ఎన్‌జీఓలు వెనుకడుగు వేస్తున్నారు. బాలకార్మికులకు మూడేళ్లు చదువు చెప్పి పైచదువులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2001లో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ౖచైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్టు కింద స్కూళ్లను మంజూరు చేసింది. అయితే అవి ఈ జిల్లాలో ఎక్కడా ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారుల తీరు మారకపోతే భవిష్యత్‌లో బాల కార్మికులు ఎక్కువయ్యే ప్రమాదముంది.

మరిన్ని వార్తలు