కత్తిగట్టిన క్యాన్సర్‌

14 Jun, 2018 11:54 IST|Sakshi
బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న అహ్మద్‌ బాషా మంచానికే పరిమితమైన అరబ్‌జాన్‌

పెద్ద కుమారుడిని బలితీసుకున్న మహమ్మారి

ఇప్పుడు రెండో కుమారుడిని కూడా పట్టిపీడిస్తున్న అదే భూతం

మంచానికే పరిమితమైన కొడుకు

ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు  

కడప కార్పొరేషన్‌: ఆ నిరుపేద కుటుంబంపై క్యాన్సర్‌ మహమ్మారి కత్తిగట్టింది. పెద్ద కుమారుడిని పొట్టనబెట్టుకున్న సైతాన్‌ చిన్న కుమారుడిని కూడా కబళించడానికి సిద్ధమైంది. దీంతో ఆ తల్లిదండ్రులు అతన్ని కాపాడుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి...

కడప నగరం కాగితాలపెంటలో చికెన్‌ అంగడి నడుపుకొనే రహమతుల్లా, సయ్యద్‌ హసీనా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాలుగేళ్లక్రితం పెద్ద కుమారుడు బాబ్‌జాన్‌(31) క్యాన్సర్‌ బారిన పడి మృతిచెందాడు. ఇప్పుడు అదే భూతం చిన్న కుమారుడు ఎస్‌. అరబ్‌జాన్‌(34)ను కూడా పట్టిపీడిస్తోంది. 4నెలల క్రితమే ఈ విషయం బయట పడింది. కర్నూల్‌కు తీసుకుపోతే పెద్ద ఆపరేషన్‌ చేశారు. తర్వాత అంతా బాగుందని పంపించేశారు. ప్రస్తుతం అరబ్‌జాన్‌ ఏమీ తినలేడు, లేవలేడు, కూర్చోలేడు. టెంకాయనీళ్లు, జ్యూస్‌లే అతని ఆహారం.  ప్రతిరోజూ జ్వరం వస్తుండటంతో ఒళ్లు సలసలా కాలిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడూ నోట్లోంచి రక్తం ప్రవాహంలా వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. స్థానిక వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా భయపడిపోతున్నారు. ప్రతిసారి కర్నూల్‌కు వెళ్లి రావాలంటే కనీసం రూ.10వేలు ఖర్చు అవుతోంది.

బస్సులో కూర్చోలేడు కనుక ప్రత్యేకంగా ఆటో తీసుకొని వెళ్లాల్సిందే.  పెళ్లి అయి పిల్లలు ఉండాల్సిన వయసులో మంచాన పడిన కుమారుడిని చూసి ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఆపరేషన్‌ అయ్యింది.. ఇక ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే వారు బంగారు తాకట్టుపెట్టి, అప్పులు తెచ్చి వారి శక్తిమేర లక్ష రూపాయల వరకూ ఖర్చు చేశారు. పెద్దకొడుకు భార్య, కొడుకు, కుమార్తె వీరిపైనే ఆధారపడి బతుకున్నారు. ప్రతిరోజూ నాలుగు టెంకాయలు, జ్యూస్‌లు కొనడానికే రూ.200 కావలసి వస్తోంది. ఇంట్లో పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది. ఇవన్నీ తలుచుకొని వారు నిత్యం కుమిలిపోతూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. దాతలు స్పందించి క్యాన్సర్‌ బారిన పడిన తమ కుమారుడిని ఆదుకోవాలని ఆ పేద తల్లిదండ్రులు కోరుతున్నారు. వారి సెల్‌ నంబర్‌ 9550073585

ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సోదరుడు
అరబ్‌జాన్‌ పరిస్థితి తెలుసుకున్న కడప శాసనసభ్యుడు ఎస్‌బి అంజద్‌బాషా సోదరుడు ఎస్‌బి అహ్మద్‌బాషా కాగితాలపెంటలోని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. వారి తల్లిదండ్రులను అడిగి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని రూ.10వేలు ఆర్థిక సాయం చేశారు. దాతలు స్పందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు