మేనరికపు ‘విధి’వంచితులు

2 Jul, 2019 06:40 IST|Sakshi

వారికి ఆస్తిపాస్తులేవీ లేవు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురూ అనారోగ్యంతో అవస్థ పడుతున్నారు. బుద్ధిమాంద్యం, నడవలేనిస్థితిలో ఇద్దరు మంచానికే పరిమితమయ్యారు. మరొకరికి మూగ–చెవుడు. వారి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయినా ఫలితం కన్పించడం లేదు. మరింత మెరుగైన వైద్యం అందిస్తే సాధారణ స్థితికి చేరతారన్న ఆశతో ఉన్నారు. వారిని ఎవరు కదిలించినా పిల్లలను కాపాడమంటూ చేతులెత్తి మొక్కుతున్నారు.   

సాక్షి, నంద్యాల(కర్నూలు) : నంద్యాల పట్టణంలోని దేవనగర్‌కు చెందిన ఉశేనిబాషా గౌండా (బేల్దారి) పనికి వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను 2009వ సంవత్సరంలో మేనమామ కుమార్తె షేక్‌ ఆశాను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికి కుమారుడు జన్మించాడు.  పేరు షేక్‌ మహమ్మద్‌ ఆసిఫ్‌. ప్రస్తుతం తొమ్మిదేళ్ల వయస్సు. మూగ–చెవుడు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. దీనికితోడు తరచూ ఫిట్స్‌ వస్తున్నాయి. అనేక వైద్యశాలల్లో చూపించినా ఫలితం లేదు. ఆసిఫ్‌ తర్వాత అమ్మాయి షేక్‌ సుహానా జన్మించింది. ప్రస్తుతం ఏడేళ్లు. పుట్టుకతోనే బుద్ధిమాంద్యం వచ్చింది. నడవలేదు, కూర్చోలేదు, మాటలు కూడా రావు. పూర్తిగా మంచానికే పరిమితమైంది. వీరిద్దరి తర్వాత జన్మించిన షేక్‌ మహమ్మద్‌ అసద్‌దీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఐదేళ్ల వయస్సున్న ఈ చిన్నారి బుద్ధిమాంద్యం కారణంగా అవస్థ పడుతున్నాడు. ఎప్పుడూ తల కిందకు దించుకునే ఉంటున్నాడు. కంటిచూపు కూడా లేదు. 

పలుచోట్ల వైద్యం చేయించినా.
వైద్యం చేయిస్తే పిల్లలు మామూలు స్థితికి వస్తారన్న ఆశతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఇప్పటికే రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశారు. బంధువులు, పరిచయస్తుల దగ్గర అప్పులు చేసి వైద్యం చేయించినా ఫలితం కన్పించడం లేదు. దీంతో ప్రతిరోజూ పిల్లల పరిస్థితిని తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.  

పూటగడవని దైన్యం.. 
కూలి పనికి వెళితేగానీ పూటగడవని స్థితి ఆ కుటుంబానిది. షేక్‌ ఆశా ఇంటి వద్ద ఉంటూ ముగ్గురు పిల్లల బాగోగులను చూసుకుంటుండగా.. ఉశేనిబాషా గౌండా  పనికి వెళుతూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. ఇక పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు చేతిలో డబ్బుల్లేక అవస్థ పడుతున్నారు. దాతలు స్పందించి తమ పిల్లల వైద్యానికి  చేయుత ఇవ్వాలని వేడుకుంటున్నారు. 

మా పిల్లలకే ఎందుకీ శిక్ష? 
పిల్లల పరిస్థితి తలచుకుని ప్రతిరోజూ వేదన పడుతున్నాం. దేవుడు మా పిల్లలకే ఎందుకీ శిక్ష వేశారు?! గత ఏడాది  పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. అయితే.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలో ఇటువంటి పిల్లలకు వైద్యం చేస్తారని కొందరు చెప్పడంతో ఆశ చిగురించింది. కానీ రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని అంటున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాం. మా చేతికి డబ్బులేమీ వద్దు. పిల్లలకు వైద్యం చేయిస్తే అంతే చాలు.
–ఉశేనిబాషా, ఆశా 

మరిన్ని వార్తలు