చనిపోయిన బిడ్డ కోసం 30 గంటలు నిరీక్షించిన తల్లిదండ్రులు

15 Dec, 2013 00:31 IST|Sakshi

నచ్చజెప్పి అంత్యక్రియలు జరిపించిన అధికారులు
 
 మంత్రాలయం, న్యూస్‌లైన్: ఒక్కగానొక్క కుమారునిపై వారి మమకారం మూఢనమ్మకాల వైపునకు దృష్టి మరల్చేలా చేసింది. బతికొస్తాడనే ఆశ 30 గంటల నిరీక్షణకు కారణమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి గర్భగుడిలో శుక్రవారం అదే గ్రామానికి చెందిన శ్రీదత్త(4) పాముకాటుతో మృతి చెందాడు. అదే రోజు కల్లుదేవకుంట ప్రాథమిక కేంద్రం వైద్యుడు ప్రతాప్ బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే కొందరు పాము కాటు లక్షణాలు లేవని, మరికొందరు చర్మం నల్లబడలేదని.. ఇంకొందరు చలనం కనిపించిందనే పుకార్లు పుట్టించడంతో బాలుడు బతికొస్తాడని తల్లిదండ్రులతో పాటు బంధువుల్లో నమ్మకం కలిగింది.
 
 అదే భావనతో దాదాపు 30 గంటల పాటు నిరీక్షించారు. బాలుడి శరీరమంతా ఆవుపేడ పూశారు. ఓ వైద్యుడు నోట్లో మాత్ర వేశాడు. కొందరు నీళ్లు తాగించే ప్రయత్నం చేయగా మింగినట్లు భ్రమపడ్డారు. అలా వాళ్లు చేయని ప్రయత్నమంటూ లేదు. శనివారం కల్లుదేవకుంటకు చెందిన హోమియో వైద్యుడు తిమ్మారెడ్డి బాలుడిని పరిశీలించి ప్రాణం లేదని చెప్పినా వారికి నమ్మకం కలగలేదు. సాయంత్రం 5గంటల వరకు కన్నీళ్లు పెట్టుకుంటూనే.. ఎంతో ఆశగా బతికొస్తాడని ఎదురుచూడసాగారు. ఈ విషయం బయటకుపొక్కడంతో అధికారులు రంగప్రవేశం చేశారు. బాధిత కుటుంబానికి నచ్చజెప్పి అంత్యక్రియలు జరిపించారు. కాగా, స్వామీజీ ఒకరు చెప్పడంతో తామిలా చేశామని వస్తున్న వార్తలు సత్యదూరమని మృతుడి తల్లిదండ్రులు ఖండించారు.
 

>
మరిన్ని వార్తలు