చిన్నారి ప్రాణానికి సాయమెవరు?

26 Sep, 2018 14:10 IST|Sakshi
కుమారుడితో తల్లి సుబ్బలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హర్షవర్థన్‌

పశ్చిమగోదావరి, మొగల్తూరు: నలుగురితో ఆడుకోవల్సిన కుమారుడు మంచంమీదన్నాడు. చదువుకోవల్సిన వయస్సులో కూతురు కిరాణా దుకాణంలో ఉంది. కుమారుడుకు వచ్చిన రోగాన్ని తలచుకుంటూ తల్లితండ్రులిరువురూ ఆసుపత్రిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఏదుర్వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనగా గడుపుతున్నారు. ఇదీ మండలంలోని కొత్తపాలెంకు చెందిన కొల్లి శ్రీనివాస్, సుబ్బలక్ష్మి దంపతుల దీనగాథ. తమ కుమారుడుకి బ్లడ్‌ కేన్సర్‌ అని డాక్టర్లు తేల్చడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు ఇలా..మండలంలోని కొత్తపాలెంలో సైకిళ్లు, ద్విచక్రవాహనాలకు పంక్చర్లు వేస్తూ, ఇంటి నిర్మాణ సామగ్రిని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న కొల్లి శ్రీనివాస్‌కు భార్య సుబ్బలక్ష్మి, కుమార్తె శ్రావణ దుర్గ, కుమారుడు వెంకట హర్షవర్థన్‌ ఉన్నారు. ఏడో తరగతి చదువుతున్న కుమారుడు మూడు నెలల క్రితం నిత్యం బడికి వెళ్లేవాడు.

ఒక రోజు శరీరంపై నల్లని మచ్చలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళనగా భీమవరంలోని చర్యవ్యాధుల ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా రక్త పరీక్షలు చేశారు. ప్లేట్‌ లెట్స్‌ పడిపోయాయని వెంటనే విజయవాడకు తీసుకు వెళ్లమని డాక్టర్లు సూచించారు. దీంతో విజయవాడలోని రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకు వెళ్లగా డాక్టర్లు రక్త పరీక్షలు చేసి బ్లడ్‌ క్యాన్సర్‌ అని తేల్చారు. కుమారుడుని ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులు, బంధువుల సహాయంతో హైదరాబాద్‌లోని బసవ తారకం కేన్సర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి బోన్‌ మ్యారో ట్రాన్ప్‌ ప్లాంటేషన్‌ చేయాలని తేల్చారు. ఈ చికిత్సకు సుమారు రూ.20 లక్షలు వరకు ఖర్చువుతుందని, అయితే కుటుంబ సభ్యుల నుంచి  బోన్‌ మ్యారో సేకరిస్తే ఖర్చు తక్కువవుతుందని చెప్పడంతో సోదరి, తండ్రి ముందుకు వచ్చారు. వారిని పరీక్షించిన డాక్టర్లు బోన్‌ మ్యారో సరిపోలలేదని  చెప్పారు. అసలే అంతంత మాత్రంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న శ్రీనివాస్‌కు ఏమి చేయాలో తెలియలేదు. బంధువులు, కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల చెక్కు మంజూరైంది. అయితే ఇప్పటికే రూ.పది లక్షల వరకు ఖర్చు పెట్టిన శ్రీను మరో రూ.పది లక్షలు ఎలా తేవాలని ఆందోళన చెందుతున్నాడు.

కుమార్తె చదువు మాన్పించిన తండ్రి
గ్రామంలో ఉన్న ఒక్క ఆదరువు పొతుందనే ఉద్దేశంతో కుమార్తె శ్రావణ దుర్గను పదో తరగతి మాన్పించి దుకాణంలో కూర్చోబెట్టాడు. తన తల్లిదండ్రులు మహంకాళి, సత్యవతిలకు కుమార్తెను అప్పగించి, బార్యాభర్తలిరువురూ కుమారుడును బతికించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.

>
మరిన్ని వార్తలు