అగచాట్లవాడి

2 Mar, 2018 08:35 IST|Sakshi
అద్దె బకాయిలు చెల్లించాలని అనంతపురం అర్బన్‌ సీడీపీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు (ఫైల్‌)

బకాయి రూ.కోట్లు..అంగన్‌వాడీ పాట్లు

తొమ్మిది నెలలుగా అందని అద్దె

సెంటర్లు నిర్వహించలేక అగచాట్లు

జీతాలు కూడా సరిగా అందని వైనం  

2016 నుంచి టీఏ, డీఏ ఊసే లేదు

అనంతపురం సెంట్రల్‌: అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటిలోనూ భాగస్వామ్యం చేసి ఊడిగం చేయించే ప్రభుత్వం.. వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదు. కనీసం అద్దెలు కూడా ఇవ్వకపోవడంతో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది. జిల్లాకు చెందిన పరిటాల సునీతనే మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నా... తమ బతుకులు మారడం లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పెర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

9 నెలలుగా అందని అద్దె
జిల్లాలో 5,126 అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా... అందులో దాదాపు 1,600 పైచిలుకు కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.750 చొప్పున భవనాలకు అద్దె చెల్లిస్తున్నారు. కానీ దాదాపు తొమ్మిది నెలలుగా అద్దె బిల్లులు మంజూరు కాలేదు. ఇంటి యజమానులు ఖాళీ చేయాలని గొడవ చేస్తున్నారు. ఈ క్రమంలో దిక్కుతోచని స్థితిలో ఇటీవల అనంతపురం అర్బన్‌ సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అయినప్పటికీ పరిస్థితి మార్పు రాలేదు. మరోవైపు రూరల్‌ మండల కేంద్రాల్లోకూడా భవనానికి రూ. 750 మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. ఈ మొత్తానికి భవనాలు దొరకగా ఇరుకు సందుల్లోనూ, కొట్టాల్లోనూ అంగన్‌వాడీ కేంద్రాలను నడిపిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. 

జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి
అంగన్‌వాడీ సిబ్బందికి కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రెండు, మూడు నెలలకోసారి జీతాలు మంజూరు చేస్తున్నారు. అయితే ఇటీవల ఆన్‌లైన్‌పేరుతో జిలాల్లో చాలా మంది అంగన్‌వాడీ సిబ్బందికి జీతాలు మంజూరు చేయడం లేదు. గతేడాది జూన్‌ నుంచి జీతాలు తీసుకోని వారు జిల్లాలో వందల మంది ఉన్నారు. జీతాలివ్వండి అంటూ కార్యకర్తలు కార్యాలయ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక అంగన్‌వాడీ కార్యకర్తలను, ఆయాలను నెలలో రెండు, మూడు సార్లు సమావేశాలకు పిలుస్తున్నా... టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. 2016 నుంచి టీఏ, డీఏలు ఇవ్వలేదని సమాచారం. పొరుగున తెలంగాణ ప్రభుత్వంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ. 13వేలు చెల్లిస్తున్నా..మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అంగన్‌వాడీలను రెగ్యులరైజేషన్‌ చేస్తామనీ, నెలకు రూ.15 వేలు చెల్లిస్తామంటూ ఎన్నికలకుముందు చంద్రబాబు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా అంగన్‌వాడీ సిబ్బంది సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు.  

పట్టించుకోని మంత్రి పరిటాల
శిశు, సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత తన సొంత జిల్లాలోని అంగన్‌వాడీల సమస్య కూడా పట్టించుకోవడం లేదు. నెలల తరబడి అద్దెలు రాకున్నా, సంవత్సరాల తరబడి బిల్లులు పేరుకుపోయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, రెండు సార్లు తప్ప మహిళా, శిశు సంక్షేమశాఖపై పెద్దగా సమీక్షలు కూడా లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు