అద్దె మొత్తం ఆరగింపు!

25 Apr, 2019 12:47 IST|Sakshi
రామగిరిలో జిల్లా క్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన షాంపింగ్‌ కాంప్లెక్స్‌

మంత్రి సునీత సమీప బంధువు నిర్వాకం

క్రీడాప్రాధికార సంస్థ షాపుల బాడుగలు స్వాహా

బాడుగ చెల్లించాలంటూ దుకాణదారులకు నోటీసులు

తమ పార్టీ అధికారంలో ఉందన్న ధైర్యం.. సాక్షాత్తూ మంత్రే తనకు అండగా ఉందన్న ధీమాతో తెలుగు తమ్ముడు రెచ్చిపోయాడు. అక్రమమని తెలిసినా.. ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో ప్రభుత్వ నిధులతో నిర్మించిన గదులకు అద్దె వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడు.తీరా అద్దెలు కట్టాలని కలెక్టర్‌ నోటీసు పంపడంతో అసలు విషయం వెలుగుచూసింది.

రామగిరి : అధికారం అండతో టీడీపీ నాయకులు... వారి అనుచరులు అందినకాడికి దండుకున్నారు. మంత్రులంతా రూ.కోట్లలో దోపిడీ పర్వం కొనసాగిస్తే...వారి అనుచరులూ అదే స్థాయిలో రెచ్చిపో యారు. మండల కేంద్రంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో రామగిరి వికాస కేంద్రం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించారు. దీనికి పరిటాల రవీంద్ర గ్రీన్‌ఫీల్డ్‌గా నామకరణం కూడా చేశారు. 2015 ఆగస్టు 1న అప్పటి క్రీడాయువజన శాఖామంత్రి అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీతతోపాటు జిల్లా అధికారులు, నాయకులు హాజరై  ప్రారంభించారు.  

 

బాడుగ సొమ్ము స్వాహా
ముందుభాగంలో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 11 రూములను అప్పట్లోనే ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిచ్చారు. నెలకు రూ.1000 చొప్పున బాడుగ నిర్ణయించారు. ఈమేరకు షాపు నిర్వాహకులు ప్రతినెలా బాడుగ మొత్తాన్ని మంత్రి పరిటాల సునీత సమీప బంధువు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామ్మూర్తి నాయిుడుకు అందజేస్తున్నారు. కానీ అతను ఆ మొత్తాన్ని  ప్రభుత్వానికి కట్టకపోవడంతో ఈ 18న కలెక్టర్‌ దుకాణదారులకు నోటీసులు పంపారు. బకాయిగా ఉన్న 43 నెలల అద్దె వెంటనే చెల్లించాలని, ఇక నుంచి బాడుగ నెలకు రూ.2 వేలకు పెంచుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రతి నెలా సక్రమంగా బాడుగ చెల్లించిన వారికి కూడా నోటీసులు అందడంతో షాపు నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. 

మరిన్ని వార్తలు