షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలి

12 Dec, 2018 08:07 IST|Sakshi
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న చింతాడ రవికుమార్, ప్రతినిధులు

జగన్‌కు పరివర్తన్‌ ట్రస్ట్‌ సభ్యుల వినతి

శ్రీకాకుళం అర్బన్‌: ఆమదాలవలస నియోజకవర్గంలో మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని పరివర్తన్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడ రవికుమార్, ట్రస్ట్‌ సభ్యులు మంగళవారం ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా ఆమదాలవలస బ్రిడ్జిరోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రాజకీయ కారణాల వల్ల 2004లో చక్కెర ఫ్యాక్టరీని మూసివేశారన్నారుల్లీ ప్రాంత రైతులంతా కోర్టును ఆశ్రయించడంతో 2016లో రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

ఆమదాలవలస నియోజకవర్గంలోని 15 మండలాల పరిధిలో 15వేలమంది రైతులు ఉన్నారని, 9,347 మంది షేర్‌హోల్డర్స్, రైతులు ఉన్నారన్నారు. పరిశ్రమ మూతపడేనాటికి చక్కెర పరిశ్రమలో వెయ్యిమంది ఉద్యోగులు పనిచేసేవారని పేర్కొన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, కూన రవికుమార్‌లు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక విస్మరించారని చెప్పారు. కాన్‌కాస్ట్‌ పరిశ్రమ, జొన్నవలస జూట్‌ఫ్యాక్టరీ కూడా మూతపడ్డాయని పేర్కొన్నారు. అందరికీ న్యాయం జరిగేలా పరిశ్రమలను తెరిపించాలని విన్నవించారు. జగన్‌ను కలిసిన వారిలో ట్రస్ట్‌ సభ్యులు సనపల అన్నాజీరావు, కిల్లి లక్ష్మణరావు, నూక శ్రీరామ్మూర్తి, గురుగుబెల్లి మధుసూదనరావు, చాపర రమేష్, సాధు చిరంజీవిరావు, చింతాడ రాజశేఖర్, బొడ్డేపల్లి మోహనరావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు