‘ఏబీసీ’తో పార్కుల అభివృద్ధి

1 Apr, 2015 02:56 IST|Sakshi
‘ఏబీసీ’తో పార్కుల అభివృద్ధి


     పురపాలక మంత్రి,
     అధికారులకు సీఎం ఆదేశం
     ముగిసిన బాబు బృందం సింగపూర్
     పర్యటన.. హైదరాబాద్‌కు చేరిక
 నేడు మంత్రివర్గ సమావేశం
 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సచివాలయం ఎల్ బ్లాక్‌లోని సీఎం చంద్రబాబు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన, రాజధాని మాస్టర్‌ప్లాన్ తయారీ తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు. కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే శాఖాధిపతులు, కలెక్టర్లతోపాటు మంత్రులతో సీఎం సమావేశమవుతారు.
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పార్కులను సింగపూర్ అనుసరిస్తున్న ‘ఏబీసీ’ విధానం ద్వారా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పార్కుల అభివృద్ధిపై సింగపూర్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని పురపాలక మంత్రి పి.నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్‌కు  ఆయన సూచించారు. సింగపూర్ పర్యటన రెండోరోజున చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం బిషన్ పార్కుతోపాటు టొపయొ పట్టణాన్ని సందర్శించింది.

ఈ సందర్భంగా పార్కులో కలియతిరిగిన చంద్రబాబు బృందం పచ్చదనం, పరిశుభ్రతను పరిశీలించింది. ఒక డ్రెయిన్‌ను నదిగా ఎలా మార్చామో అక్కడి అధికారులు చంద్రబాబుకు వివరించారు. పార్కుల అభివృద్ధితో పరిసరాల్లో ఆస్తుల విలువ భారీగా పెరిగిందని తెలిపారు. చురుకుదనం, అందం, పరిశుభ్రత (ఏక్టివ్, బ్యూటిఫుల్, క్లీన్-ఏబీసీ) అనే నీటి విధానాన్ని అమలు చేయడం ద్వారా పార్కులను అభివృద్ధి చేస్తున్నట్టు వారు వివరించారు. దీంతో ఏపీలో కాలువలు, నదులను చురుకుగా, అందంగా, పరిశుభ్రంగా మార్చేందుకు సింగపూర్ నిపుణులు తోడ్పడాలని సీఎం కోరారు.


 సింగపూర్ పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం కెప్పెల్ ఎనర్జీ ప్లాంటును సందర్శించింది. ట్వాస్ వద్ద ఉన్న ఈ ప్లాంటులో చెత్త నుంచి విద్యుత్ తయారీకి అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. 54 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్న ఈ ప్లాంటులో సింగపూర్ ప్రభుత్వానికి 24.5 శాతం వాటా ఉంది. ఈ తరహా ప్లాంటును ఏపీలో ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సింగపూర్‌లోని హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డునూ సీఎం బృందం సందర్శించింది. ఇదిలా ఉంటే చంద్రబాబు బృందం రెండు రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం అర్ధరాత్రికి హైదరాబాద్ చేరుకుంది.


 ఏపీ ప్రభుత్వం, సింగపూర్
 విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం..
 ఏపీలో సులభంగా వ్యాపారం చేయటమెలా అనే అంశంపై ఏపీ ప్రభుత్వం, సింగపూర్ జాతీయ వర్సిటీ మధ్య ఒప్పందం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) కూడా ఈ ఒప్పందంలో భాగస్వామిగా ఉంది.
 

మరిన్ని వార్తలు