పాస్‌గోల!

21 Jun, 2015 02:51 IST|Sakshi
పాస్‌గోల!

భారం కానున్న బస్సు పాసు
  
  కర్నూలు(రాజ్‌విహార్) : రాయితీ పాసులతో ఆర్టీసీ బస్సుల్లో విద్యా సంస్థలకు వెళ్లి చదువుకునే వారిపై సంస్థ సర్వీసు చార్జి రూపంలో బాదుడుకు సిద్ధమైంది. ఆన్‌లైన్‌లో పాసుల మంజూరు ప్రక్రియ పేరుతో జిల్లా విద్యార్థులపై అరకోటికిపైగా అదనపు భారం వడ్డించనుంది. జిల్లాలో దాదాపు 44వేల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్‌పాసులు పొంది పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఆర్టీసీ నిర్ణయం కారణంగా పాసుల దరఖాస్తు రుసుము గతంలో రూ.10 ఉండగా ఇప్పుడు రూ.25కు చేరింది.

దీంతో మొత్తం జిల్లా విద్యార్థులపై రూ.6.60 లక్షల వరకు భారం పడనుంది. ప్రతినెలా రెన్యూవల్ కోసం రూ.10 చెల్లించాలని చెప్పడంతో నెలకు రూ. 4.40లక్షలవుతుంది. ఇలా 11నెలలకు రూ.48.40 లక్షలవుతుంది. దీనికి మొదటి సారి విధించే రిజిస్ట్రేషన్ చార్జీ రూ.11లక్షలు కలిపితే  జిల్లా విద్యార్థులపై ఏడాదికి పడే అదనపు భారం రూ.59.40 లక్షలు.  

 ని‘బంధనాలు’...
► కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు రిజర్వేషన్ కోసం ప్రైవేట్ కంప్యూటర్ సెంటర్లను ఆశ్రయించాల్సి ఉండడంతో వారికి రూ. రూ.30 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
► సంస్థతో ఒప్పందం ఉన్న ఏజెంట్‌ను సంప్రదిస్తే తొలిసారి రూ.25 చెల్లించాలి.
► {పతి నెలా రెన్యూవల్ కోసం వెళ్తే రూ.10 సర్వీసు చార్జి చెల్లించాలి.
► కళాశాల విద్యార్థులు తప్పనిసరిగా 10వ తరగతి మార్కుల జాబితా జిరాక్స్ పత్రిని తీసుకెళ్లాలి.
► ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తప్పనిసరి.
► స్టడీ సర్టిఫికేట్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, సెల్ నెంబరు ఇవ్వాలి.
► మొదటి సారి పాస్ తీసుకున్నప్పుడు వచ్చే రెన్యూవల్ తేదీనే ప్రతి సారి(ఆలస్యంగా కట్టినా అదే తేదీ వస్తుంది) గడువుగా ఇస్తారు.
 
 మొబైల్ సెంటర్లు కూడా ఏర్పాటు : కోటేశ్వ రావు, ఈడీ
 రాయితీ పాసుల మంజూరులో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్టీసీ కడప జోన్ ఈడీ కోటేశ్వర రావు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానం ద్వారా బస్ పాసుల మంజూరుకు కర్నూలు కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రతి డిపోకు ఒక కేంద్రంతో పాటు మరో 11 మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీటీఎం శ్రీనివాసులు, ఏటీఎం ప్రసాద్, డీఎంలు సత్తార్, అజ్మతుల్లా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు