కాంగ్రెస్ ఖాళీ!

5 Oct, 2013 03:22 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం : కేంద్ర క్యాబినెట్ తెలంగాణ నోట్‌పై ఆమోదముద్ర వేయడం ఆ పార్టీలో కల్లోలం రేపింది. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయం ‘అనంత’ ప్రజానీకాన్ని ఆగ్రహానికి గురిచేసింది. అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై శుక్రవారం సమైక్యవాదులు దాడి చేశారు. కాంగ్రెస్ జెండాలను.. సోనియాగాంధీ దిష్టిబొమ్మలను ఎక్కడికక్కడ దహనం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బ తీసింది.
 
 పజల మనోభిప్రాయాలను గౌరవించని కాంగ్రెస్ అధిష్టానంపై ఆ పార్టీ శ్రేణులు తిరుగుబాటు బావుటా ఎగురవేశాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అనంతపురం లోక్‌సభ సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ నోట్‌పై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసిందన్న వార్త వెలువడగానే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఎంపీ అనంత రాజీనామా చేశారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని ఆయన తెంచుకున్నారు. కేంద్ర మంత్రి మండలి తెలంగాణ నోట్‌ను ఆమోదించాక రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అ/ా్ఞతంలోకి వెళ్లారు. జిల్లాలో సమైక్యాంధ్ర సెంటిమెంటు బలీయంగా వేళ్లూనుకుపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలేననే నిర్ణయానికి వచ్చిన మంత్రి రఘువీరారెడ్డి కర్ణాటకకు వలసబాట పట్టారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలోని తుమకూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రఘువీరా సన్నద్ధమవుతున్నారు.
 
 రఘువీరా వైఖరితో విసిగిన కళ్యాణదుర్గం కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం మండల కన్వీనర్ తలారి వెంటకటేశులు, పట్టణ కన్వీనర్ జయరాం పూజారి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కంబదూరు, కుందుర్పి మండలాల కన్వీనర్లు మంజునాథరెడ్డి, ప్రసాదరెడ్డి, గోవిందరెడ్డి, రాజగోపాల్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినట్లు అయింది. కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డు చైర్మన్ రఘునాథరెడ్డి కూడా పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
 
 పాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న శింగనమల నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ శ్రేణులు రాజీనామా బాట పట్టాయి. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. యల్లనూరు, పుట్లూరు మండలాల్లోని 14 మంది సర్పంచులతో కలిసి కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల నేతలూ అదే బాట పట్టడంతో ఆ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ఆ పార్టీ శ్రేణులే స్పష్టీకరిస్తున్నాయి.
 
 ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా రాజీనామా బాట పట్టారు. రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన మడకశిరలో కాంగ్రెస్ నేతలు శనివారం సమావేశం ఏర్పాటుచేసుకుని.. భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే పుట్టపర్తి, కదిరి, రాప్తాడు, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిన విషయం విదితమే. ప్రజల ఛీత్కారానికి గురైన కాంగ్రెస్ పార్టీ జెండా ఇక జిల్లాలో ఎగరడం అసాధ్యమని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు