‘ప్లాట్‌ఫాం’పై రైల్వే ప్రయాణికుల కొత్త ఎత్తుగడ!

3 Oct, 2019 14:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రైల్వే శాఖ ఇటీవల రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.30కు పెంచింది. పెరిగిన ధరలు దసరా పండుగ సందర్భంగా పదిరోజులపాటు అమలులో ఉంటాయని ప్రకటించింది. రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరను భారీగా పెంచడంతో ప్రయాణీకులు ఈ భారం నుంచి తప్పించుకోవడానికి తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌ టికెట్ల కన్నా.. గుంటూరు ప్యాసింజర్‌ రైలు టికెట్లు పెద్దమొత్తంలో అమ్ముడుపోతున్నాయి. కారణం ఏంటని ఆరా తీసిన రైల్వే అధికారులు.. ప్రయాణికుల వ్యూహంతో బిత్తరపోతున్నారు.

విజయవాడ రైల్వే స్టేషన్‌లో తమ బంధువులకు స్వాగతం పలికేందుకు, లేదా వీడ్కోలు పలికేందుకు వస్తున్న వారు.. ఫ్లాట్ ఫామ్ టికెట్‌కు బదులు పది రూపాయలు పెట్టి.. గుంటూరు పాసింజర్ టికెట్లు కొంటున్నారు. దీంతో వారికి రూ. 20 ఆదా కావడమే కాకుండా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేందుకు అనుమతి లభిస్తోంది. దీంతో చాలామంది తెలివిగా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దీంతో ప్లాట్‌ఫామ్ టికెట్ల కన్నా గుంటూరు ప్యాసింజర్ టికెట్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు తాజాగా ప్రయాణికులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. 

ప్రయాణికుల భద్రత కోసమే పెంచాం
ప్లాట్‌ఫామ్‌ టికెట్ ధర పెంచడం వల్ల రైల్వే శాఖకు వచ్చే ఆదాయం అతి స్వల్పమని, ప్రయాణికుల భద్రత కోసమే పెంచామని విజయవాడ రైల్వే ఏడీఆర్ఎం సుమన తెలిపారు. రైల్వే స్టేషన్‌లో కొన్నిచోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండకపోతే ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు. ప్రమాదాలను తగ్గించడానికే ధరలు పెంచామని తెలిపారు. 'ఫ్లాట్‌ఫామ్‌ టికెట్లు మాత్రమే కొనండి, తక్కువ ధర అని గుంటూరు ప్యాసింజరు రైలు టికెట్లు కొనకండి' అని ఆమె ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు