నిలిచిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల వెతలు

8 Aug, 2013 02:16 IST|Sakshi

హైదరాబాద్,న్యూస్‌లైన్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుండడంతో రాయలసీమ, కోస్తాంధ్రాలవైపు వెళ్లే ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయాయి.  సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఎనిమిది రోజులుగా ఆర్టీసీ సర్వీసులు నడవకపోవడంతో అటువైపు ప్రయాణం సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోస్తావైపు  ఓ మోస్తరుగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నప్పటికీ రాయలసీమ వైపు వెళ్లాల్సిన బస్సులన్నీ పూర్తిగా నిలిచిపోయి డిపోలకే పరిమితమయ్యాయి.
 
  గత శనివారం నుంచి ఆర్టీసీ అధికారులు కర్నూలువరకు అరకొరగా బస్సులను నడుపుతున్నారు. బుధవారం రాత్రి 8గంటల వరకు ఎంజీబీఎస్ నుంచి 2588 బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా  కేవలం 2170 మాత్రమే వెళ్లాయి. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి 2648 బస్సులు ఎంజీబీఎస్‌కు రావాల్సి ఉండగా 2137 మాత్రమే వచ్చాయి. కాగా ఈనెల 9, 10,11 తేదీల్లో వరుస సెలవుల కారణంగా రాయలసీమ, కోస్తాంధ్ర వైపు వెళ్లే ఆర్టీసీ షెడ్యూల్డ్ సర్వీసులకు ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ముందస్తుగా అడ్వాన్స్‌గా రిజర్వేషన్ కల్పించడంతో గురువారం షెడ్యూల్డ్ బస్సుల సీట్లు అన్నీ రిజర్వయ్యాయి. గురువారం పరిస్థితిని బట్టి బస్సులు నడిపిస్తామని, రాయలసీమ వైపు బస్సులు నడపలేని పక్షంలో ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు