ఈ వారంలోనే జిల్లాలో పాస్‌పోర్ట్‌ కార్యాలయం

2 Apr, 2018 09:10 IST|Sakshi
పాస్‌పోర్ట్‌ కార్యాలయ భవనాన్ని పరిశీలిస్తున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

ఒంగోలు వన్‌టౌన్‌: జిల్లా వాసుల కల ‘పాస్‌పోర్ట్‌ కార్యాలయం’ ఈ నెల మొదటి వారంలో నగరంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ ప్రాంగణంలో ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం హెడ్‌ పోస్టాఫీస్‌ ప్రాంగణంలో పాస్‌పోర్ట్‌ కార్యాలయంనకు సిద్ధం చేసిన భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీ విలేకరులతో మాట్లాడారు. జిల్లా వాసుల చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పాస్‌పోర్ట్‌ కార్యాలయం విషయమై గత నాలుగేళ్లుగా కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి తో మాట్లాడామన్నారు.  జిల్లా పరిస్థితులు పలుమార్లు వివరించామన్నారు. విదేశాలకు వెళ్లే వారు పాస్‌ పోర్ట్‌ పొందాలంటే తిరుపతి, విజయవాడ, హైదరాబాద్‌ పలుమార్లు తిరగడం, సకాలంలో పని జరుగక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, మంత్రికి వివరించి అనుమతులు పొందినట్లు ఎంపీ తెలిపారు.

రెండేళ్ల క్రితమే  అన్ని విధాలా అనుమతులు పొందినప్పటికీ కార్యాలయం ప్రారంభానికి అనువైన భవనంకు సమయం పట్టిందన్నారు. అనుకున్న విధంగా జిల్లా పోస్టల్‌ అధికారులు పాస్‌ పోర్ట్‌ కార్యాలయంను సిద్ధం చేసినందుకు ప్రతి ఒక్క అధికారికి, సిబ్బందికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఎంపీ  తెలిపారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి  వారం రోజుల్లోనే పాస్‌ పోర్ట్‌ కార్యాలయం ప్రారంభిస్తామని ఎంపీ వివరించారు. ఇకపై జిల్లా వాసులు ఒంగోలు లోనే పాస్‌ పోర్ట్‌ పొందవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు. ఎంపీ వైవీ వెంట హెడ్‌ పోస్టాఫీస్‌ పీఎం పి.వెంకటేశ్వరరావు,  పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ మీరజ్‌ ఫాతి మా, పెన్షనర్‌ అసోసియేన్‌ అధ్యక్షుడు పి.పేరయ్య, పోస్టల్‌ యూనియన్‌ నేతలు యం.రాజశేఖర్, కె.వీరాస్వామి రెడ్డి,పోస్టల్‌ సిబ్బంది, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు వేమూరి బుజ్జి, రాయపాటి అంకయ్య, బడుగు కోటేశ్వరరావు, తోటకూర వెంకటరావు, చింతపల్లి గోపి ఉన్నారు. 

రైల్వే గేట్‌ అండర్‌ పాస్‌వే పనులు ప్రారంభం
ఒంగోలు వన్‌టౌన్‌: అగ్రహారం రైల్వేగేట్‌ వద్ద అండర్‌ పాస్‌ వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి పొంది, కేంద్రం వంతుగా రూ.13 కోట్లు మంజూరయినా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన కారణంగా అనుమతులు వచ్చి రెండున్నర ఏళ్లు అయినా పని మొదలు కాలేదని ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన రూ.20కోట్లు మంజూరుకు పదే పదే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి వచ్చిందని ఎంపీ తెలిపారు. రైల్వే అధికారులు పలుమార్లు మున్సిపల్‌ అధికారులతోను, రాష్ట్ర ప్రభుత్వంతోను మాట్లాడినా ఎటువంటి స్పందన లేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.13 కోట్లతో ఆర్‌ఓబీకి బదులు ఆర్‌యూబీ నిర్మాణం చేయాలని కేంద్రం నిర్ణయించిందని ఎంపీ తెలిపారు.  అధికారులు అన్ని ప్రయత్నాలు పూర్తయ్యే ప్లాన్‌ సిద్ధం చేయడం జరిగిందన్నారు. నెలలోపల రైల్వే అండర్‌ పాస్‌ వే నిర్మాణ పనులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు.

ఈ నెలలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. నిర్మాణంలో సహకారం అందించమని స్థానికులును కోరామని, రాఘవేంద్ర స్వామి దేవస్థానం యాజమాన్యం వారు కూడా సహకరిస్తామని తెలిపారని ఎంపీ అన్నారు. ఎంపీ వెంట రైల్వే ఏఈ రాజేంద్ర, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ దేవదాస్‌లు ఉన్నారు.  కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులతో పాటు స్థానిక వైఎస్సార్‌ సీపీ నేతలు వేమూరి బుజ్జి, ఆర్‌.అంకయ్య, బి.కోటేశ్వరరావు, టి.వెంకటరావు, సీహెచ్‌ గోపి ఉన్నారు.

మరిన్ని వార్తలు