భీమవరంలో త్వరలో పాస్‌పోర్ట్ సేవలు

9 Nov, 2014 01:07 IST|Sakshi
భీమవరంలో త్వరలో పాస్‌పోర్ట్ సేవలు

 భీమవరం : ఉభయ గోదావరి జిల్లాల ప్రజల సౌకర్యార్థం భీమవరంలో పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించి సేవలను అందించనున్నట్టు విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారి ఎన్‌ఎల్‌పి.చౌదరి పేర్కొన్నారు. శనివారం భీమవరంలో పాస్‌పోర్ట్ కార్యాలయం నిమిత్తం ఏర్పాటు చేసిన నూతన భవనాన్ని ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజల కష్టాలను తీరుస్తామన్నారు. ఎన్నికల ముందే భీమవరంలో పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రారంభించాల్సి ఉందని, ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయినట్టు తెలిపారు.
 
 కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల సూచనల మేరకు ఈ కార్యాలయంలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యాలయం ప్రారంభించే తేదీని కేంద్ర అధికారులు నిర్ణయిస్తారన్నారు. స్థానిక ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో ఈ విషయంపై చర్చించినట్టు చెప్పారు. కార్యాలయ భవనానికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారన్నారు. ఆయన వెంట డీఎన్నార్ కళాశాల పాలకవర్గ సభ్యుడు పొత్తూరి ఆంజనేయరాజు, లా కళాశాల సభ్యుడు కంతేటి వెంకటరాజు, ప్రిన్సిపాల్ పి.రామకృష్ణంరాజు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యు.రంగరాజు తదితరులు పాల్గొన్నారు.
 
 భీమవరంలో 15న పాస్‌పోర్ట్ మేళా
 భీమవరంలో ఈనెల 15, 16 తేదీల్లో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారి ఎన్‌ఎల్‌పి చౌదరి పేర్కొన్నారు. శనివారం భీమవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక డీఎన్నార్ కళాశాల ఆడిటోరియంలో పాస్‌పోర్ట్ సేవా శిబిరం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీని నిమిత్తం ఈనెల 12న సాయంత్రం 5.30 గంటల నుంచి వెబ్‌సైట్ ప్రారంభమవుతుందన్నారు. దీని ద్వారా రిజిస్ట్రార్ చేసుకుని స్లాట్‌లు పొందవచ్చన్నారు. స్లాట్ పొందిన వారంతా 15, 16 తేదీల్లో భీమవరంలో నిర్వహించే సేవా శిబిరానికి హాజరుకావాలన్నారు. ఈ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకోదలచిన వారు ఇంటర్‌నెట్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. పాస్‌పోర్ట్‌ఇండియా.జివోవి.ఇన్ అనే వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదుచేసుకోవాలన్నారు. జనన ధ్రువీకరణ, నివాస చిరునామా, విద్యార్హత, ఫొటో గుర్తింపు ఉన్న ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా మేళాకు తీసుకురావాలని కోరారు.

 

మరిన్ని వార్తలు