రాజధాని రైతులకు బాబు శఠగోపం

28 Nov, 2019 04:45 IST|Sakshi

భూములు తీసుకునేటప్పుడు ఎడాపెడా హామీలు

ఒక్క హామీ కూడా నెరవేర్చని వైనం

వారికివ్వాల్సిన ప్లాట్లు, లేఅవుట్లపై తీవ్ర నిర్లక్ష్యం

చేయాల్సిన నష్టం చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంపై నెపం

సాక్షి, అమరావతి : రాజధాని రైతుల్ని అన్ని విధాలుగా మోసం చేసిన గత టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ వారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. మాయమాటలు చెప్పి రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో వారికిచ్చిన హామీల్లో ఒక్కదాన్నీ నెరవేర్చలేదు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన 28,054 మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలను అప్పటి ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా సేకరించింది.

ఈ భూమికి బదులు మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తామని, వీటి విలువ ఇచ్చిన భూమి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మించింది. అయితే నాలుగేళ్ల తర్వాత రైతులకు భౌతికంగా ప్లాట్లు అప్పగించకుండా కేవలం కాగితాల్లోనే పంపిణీ చేసింది. రైతులిచ్చిన భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో తమకిస్తామని చెప్పిన ప్లాట్లలో పిచ్చి మొక్కలు మొలిచి, బీళ్లుగా మారాయని.. వాటి పక్కనే అపార్ట్‌మెంట్లు నిర్మించి వేరే వాళ్లకి అమ్మడం ఎంతవరకు సమంజసమని రైతులు వాపోయినా పట్టించుకోలేదు.
 
కాగితాలపై మాత్రమే అద్భుతాలు
29 గ్రామాల్లో రైతుల వాటాగా ఇవ్వాల్సిన ప్లాట్ల లేఅవుట్లను 13 జోన్లుగా విభజించి వాటిలో రోడ్లు, డ్రెయిన్లు, మురుగు నీటి పారుదల, తాగునీటి సరఫరా, విద్యుదీకరణ, భూగర్భ డ్రైనేజీ వంటి సకల సౌకర్యాలు కల్పిస్తామని సీఆర్‌డీఏ ప్రకటించింది. కమిషన్ల కోసం తాత్కాలిక నిర్మాణాలు మొదలు పెట్టినా ఐదేళ్లలో ఒక్క జోన్లో కూడా పనులు పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం లేక తమకు తిరిగి ఇచ్చిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు రైతులు ముందుకు రాలేదు. మ్యాపులు, కాగితాల్లో మాత్రం అద్భుతమైన ప్లాట్లు ఇస్తున్నట్లు చిత్రాలతో చూపి, వాటిని సంబంధిత రైతులకు కేటాయించినట్లు ప్రచారం చేశారు.

లేఅవుట్లకు వెళ్లేందుకు రోడ్లు కూడా లేవు. లోపల అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, వీధిలైట్లు వంటి కనీస సదుపాయాలు లేవు. కార్పొరేట్‌ సంస్థలు, వారికి నచ్చిన వారికి కారుచౌకగా కట్టబెట్టిన భూముల్లో మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించారు. విట్, ఎస్‌ఆర్‌ఎం, బీఆర్‌ శెట్టి వంటి సంస్థలకు ఎకరం రూ.50 లక్షలకు కట్టబెట్టగా ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు ఏకంగా ఎకరం రూ.4 కోట్లకు విక్రయించారు. ఇంతా చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి జరగడం లేదని గగ్గోలు పెడుతుండడం చూసి రైతులు విస్తుపోతున్నారు.

మరిన్ని వార్తలు