పాస్టర్ హత్య గర్హనీయం

17 Jan, 2014 02:23 IST|Sakshi
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ : వికారాబాద్‌లోని చర్చి పాస్టర్‌పై దాడి చేసి హత్య చేయడాన్ని బిషప్ గాలిబాలి తీవ్రంగా ఖండించారు. స్థానిక రింగ్‌రోడ్డులోని బిషప్ హౌస్‌లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాలిబాలి మాట్లాడుతూ వికారాబాద్‌లోని ఇవాంజిలికల్ పాస్టర్ సంజీవులుపై ఈనెల 11న నలుగురు వ్యక్తులు దాడి చేశారని, అనంతరం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న పాస్టర్ సోమవారం మరణించారని చెప్పారు. క్రైస్తవ సంఘాలన్నీ ఈ దుర్ఘటనను ఖండిస్తున్నాయన్నారు. పాస్టర్లకు ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు దాటినా ఇప్పటికీ నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని ఆరోపించారు. పాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ ఉపాధ్యక్షులు రెవరెండ్ చంద్రబోస్ మాట్లాడుతూ క్రైస్తవ సంఘాల నాయకులు ఈ సంఘటనపై ముఖ్యమంత్రిని కలిసి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. సెక్యులర్ భావాలు ఉన్న అందరూ ఇటువంటి ఘటనలను ఖండించాలన్నారు. సమావేశంలో రెవరెండ్ ఫాదర్ రాయప్ప, రెవరెండ్ ఉదయ్‌కుమార్, రెవరెండ్ రాజేష్, రెవరెండ్ జ్ఞానరత్నం, బిషప్ పీఆర్వో కనపాల జోసఫ్ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు