పసి ప్రాణంపై కసి

26 Dec, 2014 09:38 IST|Sakshi
పసి ప్రాణంపై కసి

*కనకదుర్గమ్మ వారధి వద్ద ఘోరం
*నదిలోకి విసిరేసి అన్న కుమారుడిని అంతం చేసిన బాబాయి
*తాతయ్య, నానమ్మల వద్దకు వచ్చి బాబాయి చేతికి చిక్కిన చిన్నారి
*ఇంటికి రాలేదని వెతుకుతూ వస్తుండగా కనిపించిన మృతదేహం
* గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు

 
ముద్దుముద్దు మాటలు మూగబోయాయి.. బుడిబుడి అడుగులు ఆగిపోయాయి.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న చిన్నారి ఇక లేడని తెలిసిన ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి.  హైదరాబాద్‌కు చెందిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజను సొంత బాబారుు హరిహరన్ బుధవారం అర్ధరాత్రి దాటాక కనకదుర్గమ్మ వారిధి పై నుంచి కృష్ణానదిలోకి విసిరి కసిగా ఉసురు  తీశాడని తేలడంతో గుండెలు పగిలేలా ఆ దంపతులు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.
 
 
తాడేపల్లి రూరల్(గుంటూరు) : అసూయ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఘాతుకానికి కారకుడైన నిందితుడూ కనిపించకుండా పోయాడు. అసూయతో ఏడాదిన్నర వయస్సుగల చిన్నారిని సొంత బాబాయే కాలయముడై కృష్ణానదిలోకి విసిరి హత్య చేయడం సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతి చెందిన చిన్నారిని గురువారం తాడేపల్లి పోలీసులు కనుగొన్నారు. కనకదుర్గమ్మ వారధి 28, 29 ఖానాల మధ్య నదిలో తేలియాడుతున్న మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ(18 నెలలు)ను తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి గోడపాటి హరిహరణ్ వారధిపై నుంచి నదిలోకి విసిరి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు, కుటుంబీకులు బంధువుల కథనం మేరకు మోక్షజ్ఞతేజ హత్యోదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 తెనాలి బాలాజీరావుపేటలోని మహేంద్రకాలనీకి చెందిన గోడపాటి రాంబాబు పొన్నూరులో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. అతని ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన భాస్కరరావు భార్య విమలప్రియతో కలిసి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ తమ కుమారుడైన చిన్నారి మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు.

ఏఎస్‌ఐ రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్ కూడా ఉద్యోగంలో స్థిరపడగా, మూడవ కుమారుడు, ఈ సంఘటనలో నిందితుడైన హరిహరణ్ ఇంజినీరింగ్ చదివినప్పటికీ జులాయిగా తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు.ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చిన్నారి మోక్షజ్ఞతేజ తండ్రి భాస్కరరావు తెనాలి వచ్చి పద్ధతి మార్చుకోవాలని తమ్ముడైన హరిహరణ్‌కు హితబోధ చేసి వెళ్లారు. దీనిని మనసులో పెట్టుకున్న హరిహరణ్.. బుధవారం సాయంత్రం ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు.

రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకనారంభించారు. ఈ క్రమంలో కృష్ణానది వద్దకు చేరుకున్న రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు కనకదుర్గమ్మవారధి వద్ద పెద్ద సంఖ్యలో జనం ఉండడంతో కంగారుపడి వెళ్లి చూడగా చిన్నారి మోక్షజ్ఞ నదిలో శవంగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా చంద్రశేఖర్ ‘బాబాయి చేతిలో బలైపోయావా నాన్నా’ అంటూ బోరున విలపించాడు. అనంతరం అక్కడకు చేరుకున్న మంగళగిరి రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు, తాడేపల్లి ఎస్‌ఐ దుర్గాసి వినోద్‌కుమార్‌లకు జరిగిన విషయాన్ని చంద్రశేఖర్ వివరించారు.

 చిన్నారిని తీసుకువచ్చిన బాబాయి హరిహరణ్ వారధిపై నుంచి విసిరి నదిలో పడేసి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు. వారధిపై ఇంటి నుంచి నిందితుడు తెచ్చిన పంచను పోలీసులు కనుగొని ఇక్కడ నుంచే హత్య చేసి ఉంటాడని భావించారు. చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని మంగళగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు