పసిడిపురి.. ఆరోగ్య సిరి

26 Mar, 2014 02:13 IST|Sakshi

బంగారం వ్యాపారంలో రెండో ముంబైగా ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరు  ‘పసిడి పురి’గా పేరుగాంచింది. అంతటి కీర్తి సంపాదించిన ప్రొద్దుటూరు ‘ఆరోగ్యం’ విషయంలోనూ ఏమాత్రం తీసిపోకూడదనుకున్నారు. 30 పడలక ఆస్పత్రిని వంద.. తరువాత 350కు పెంచారు. జిల్లా స్థాయి ఆస్పత్రి హోదా కల్పించారు. అలా అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఇక్కడి ఆస్పత్రిలో అన్ని రోగాలకూ అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అందుకు ఆరోగ్యశ్రీ తోడ్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే అందరికీ ఆరోగ్యసిరి పంచారు.
 
 పురిటి పిల్లలకు కార్పొరేట్ వైద్యం
 ప్రొద్దుటూరులోని 30 పడకల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల ఒకప్పుడు ప్రొద్దుటూరుతో పాటు రాజుపాళెం, దువ్వూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల ప్రజలకు ‘పెద్ద దిక్కు’గా ఉండేది. పైన పేర్కొన్న ప్రాంతాల్లో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలే అధికంగా నివసించేవారు. తమకు ఏ చిన్న రోగమొచ్చినా ప్రొద్దుటూరు ఆస్పత్రికి వచ్చి వైద్య చికిత్స చేయించుకునేవారు. జనాభా పెరిగింది. రోగులూ పెరిగారు. ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్యా అంతకంతకు పెరిగింది.
 
 వంద పడకలకు పెంచినా...
 రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆస్పత్రి స్థాయిని పెంచాలని అనేక విన్నపాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రోగులు, వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2000 సంవత్సరంలో ప్రొద్దుటూరు ఆస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచారు.
 
 పొద్దుటూరు సహా పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు నిత్యకృత్యం. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఘర్షణలు ఇతర కేసుల్లో గాయపడ్డ బాధితుల్నైనా ప్రొద్దుటూరు ఆస్పత్రికే తీసుకువచ్చేవారు. మరోవైపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సైతం తరచూ నిర్వహించేవారు. దీంతో కొన్ని సందర్భాల్లో పడకలు చాలక రోగులు ఇబ్బంది పడేవారు. ఈ పరిస్థితుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గుర్ని పడుకోబెట్టేవారు.
 
 ఎవరెన్ని చెప్పినా..
 కడపలో రిమ్స్ ఉండగా.. జిల్లా స్థాయి ఆస్పత్రిని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎంతో మంది ఎన్నో విధాలుగా అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. ఒత్తిడీ తెచ్చారు. అయితే వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా జిల్లా వాసులకు అవసరమైన మరో పెద్దాస్పత్రిని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. 350 పడకల ఆస్పత్రిని 2005 ఆగస్టు 3న భూమి పూజ చేశారు. రూ.11 కోట్లతో అధునాతనమైన భవంతులతో దీన్ని నిర్మించారు. 2011 ఆగస్టు 12న దీన్ని ప్రారంభించారు.
 
 నాడు మూడు విభాగాలే..
 ఏరియా ఆస్పత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కేవలం మూడు విభాగాలు మాత్రమే పని చేసేవి. జిల్లా ఆస్పత్రిగా స్థాయి పెరిగాక అనేక విభాగాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఆర్థో, ఆప్తాలమిక్, ఈఎన్‌టీ, మత్తుకు ప్రత్యేక విభాగం, చిన్నపిల్లల విభాగం, ఏఆర్‌టీ, టీబీతో పాటు అనేక విభాగాలు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో నడుస్తున్నాయి. ఆయా విభాగాల్లోని వైద్యులు నిత్యం ఇక్కడ శస్త్ర చికిత్సలు చేస్తుంటారు.
 
 ఆరోగ్యశ్రీతో అందుబాటులోకి శస్త్ర చికిత్సలు
 జిల్లా ఆస్పత్రి స్థాయి పెరిగాక ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్యశ్రీ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి రోజూ ఆర్థో, స్త్రీల వ్యాధులు, చిన్న పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు కూడా జరగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ నియోజక పరిధిలో సుమారు 3,500 ఆపరేషన్లు జరిగాయి.   
 
 జిల్లా ఆస్పత్రిగా రూపుదిద్దుకున్న ప్రొద్దుటూరు ఆస్పత్రిలో నవజాత శిశు కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్‌ఎన్‌సీయూ విభాగాన్నీ  ప్రారంభించారు. సాధారణంగా పురిటి పిల్లలకు ప్రొద్దుటూరు సహా పరిసర ప్రాంతాల్లో చికిత్సా విభాగాలు లేవు. అయితే జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎన్‌సీయూ విభాగం  నలుగురు చిన్నపిల్లల వైద్యులు పర్యవేక్షణలో విజయవంతంగా నడుస్తోంది. తాజాగా ఇక్కడ సీ పాప్, వెంటి లేటర్ ద్వారా పురిటి పిల్లలకు చికిత్సలు అందిస్తున్నారు. ఇక్కడ లభిస్తున్న సేవలు చూస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఇలాంటి సేవలు ఉండవనే అభిప్రాయం అందరిదీ.  
 
 వైఎస్ చలవతోనే పెద్దాస్పత్రి
 వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలవతోనే మా ప్రాంతానికి ఇంత పెద్ద ఆస్పత్రి వచ్చింది. ఇక్డకి అస్పత్రి భవనాలు చూస్తుంటే కళ్లు తిరుగుతాయి. వైఎస్ లేకుంటే ఇన్ని లక్షలు పెట్టి ఎవరు కట్టిస్తారు? ఆయన మా జిల్లా వాసి కావడం మా అదృష్టం. అందుకే 350 పడకలతో ఆస్పత్రి వచ్చింది. ఆయనే ఉన్నింటే ఆస్పత్రి ఇంకా  అభివృద్ధి చెందేది.    
 - లక్ష్మీదేవి, సంజీవనగర్
 
 ఆరోగ్యశ్రీ కాపాడుతోంది
 మా ఊరి ఆస్పత్రికి వైఎస్ జిల్లా స్థాయి హోదా కల్పించారు. ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారు. ఏ ప్రమాదం జరిగినా, ఎంత పెద్ద రోగమొచ్చినా లక్షలు విలువ  చేసే వైద్యం ఉచితంగా అందుతోంది. ఇంతకు ముందు ఏ చిన్న ప్రమాదం జరిగినా దూర ప్రాంతాలకు వెళ్లే వాళం. ఇప్పుడా అవసరం లేకుండా పోయింది. జగన్ సీఎం అయితే ఆస్పత్రి ఇంకా బాగుపడుతుంది.      
 - యాడికి సుబ్బమ్మ, ప్రొద్దుటూరు
 
 మెడికల్ కాలేజీ వచ్చేది
 వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతి ఉన్నింటే ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజీ వచ్చేది. ఆయన అకాల మరణంతో జిల్లా అభివృద్ధితో పాటు ఆస్పత్రి అభివృద్ధి కూడా కుంటుపడింది. వైద్యులు, అనేక వ్యాధుల విభాగాలు ఉన్నా తగినన్ని పరికరాలు లేక, కొన్ని రకాల చికిత్సలకు ఇబ్బంది కలుగుతోంది. జగన్ అధికారంలోకొస్తే ఆ సమస్యా తీరుతుంది.
 - సిరిశెట్టి నరసింహులు, పెన్నానగర్
 
 వైఎస్ వల్లే బతికా
 నాకు గుండెజబ్బు వచ్చింది. డాక్టర్లను కలిస్తే స్టంట్స్ వేయాలన్నారు. అందుకు రూ.లక్ష ఖర్చవుతుందన్నారు. అంత స్థోమత నాకు లేదు. ఈ సమయంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ నాలో ధైర్యం నింపింది. హైదరాబాద్ నాంపల్లెలోని కేర్ ఆస్పత్రిలో 2008 మే 18న ఆపరేషన్ చేయించుకున్నా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ఆయనే లేకుంటే నేనీ రోజు మీతో ఇలా మాట్లాడేవాడ్ని కాదు. అందుకు వైఎస్ కుటుంబానికి  రుణపడి ఉన్నా.
 - కుప్పం శ్రీణివాసరావు, కె.రాజుపల్లె, చక్రాయపేట మండలం
 

>
మరిన్ని వార్తలు